వారందరికీ రూ.10వేలు ఇవ్వబోతున్నాం: సీఎం జగన్‌

27 Aug, 2019 14:06 IST|Sakshi

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

అక్టోబరు 15న రైతు భరోసా పథకం

మగ్గమున్న ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24వేలు

జనవరి 26న అమ్మ ఒడి

ఫిబ్రవరి చివరి వారంలో వైఎస్సార్‌ పెళ్లికానుక

సాక్షి, అమరావతి : సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి  సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే గాకుండా, వాలంటీర్లు ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై కూడా దృష్టిపెట్టాలని ఆదేశించారు. డబ్బు జమకాగానే ఈ రశీదులను లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు.

అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని..ఈ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టంచేశారని సీఎం జగన్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని తాను లేవనెత్తినప్పుడు ఆమె స్పష్టతనిచ్చారని పేర్కొన్నారు. 

వారికి కూడా రూ.10 వేలు
నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు పోయే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో సహాయం అందజేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. పడవలు, బోట్లు ఉన్నా మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా... డీజిలు పట్టించేటప్పుడే వారికి సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందుకోసం కొన్ని బంకులను ఎంపిక చేసి.. ఈ బంకుల జాబితాను మత్స్యకారులకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం లీటర్‌పై రూ.6 లు ఇస్తున్నారని, దీనిని తమ ప్రభుత్వం రూ.9లకు పెంచబోతుందని..నవంబర్‌ 21న ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు.

ఇక వివిధ పథకాల అమలు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘ అక్టోబరు 15న రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతుంది. రైతు భరోసా కౌలు రైతులకూ ఇస్తామని చెప్పాం. దీనిపై రైతులు, కౌలు రైతులను ఎడ్యుకేట్‌ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లది. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయి. రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించాలి. రబీకి పంటలకు సంబంధించే విధంగా రైతు భరోసా ఉంటుంది. అదే విధంగా డిసెంబర్‌ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. మగ్గమున్న ప్రతీ చేనేత కుటుంబానికి రూ.24వేలు చేతిలో పెట్టబోతున్నాం. ఈ పథకం అమలు పైనా దృష్టిపెట్టాలి. 

జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నాం. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఇది ఫిబ్రవరి చివరి వారంలో అమలు చేస్తాం. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి వైఎస్సార్‌ పెళ్లికానుకను ఫిబ్రవరి చివరి వారంలోనే అమల్లోకి తీసుకు వస్తున్నాం. మార్చి చివరి వారంలో ధూప, దీప నైవేద్యాలకు సంబంధించి, అలాగే మసీదులకు సంబంధించి ఇమామం, మౌజంలకు, అదే విధంగా చర్చిలకు సంబంధించి పాస్టర్లకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చాం. వాటిని మార్చి చివరి వారంలో అమల్లోకి తీసుకువస్తాం. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుంది. ఇదే నెలలోనే 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నాం. ఇది అతిపెద్ద భారీ కార్యక్రమం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు.

ఈరోజే ఆదేశాలు ఇచ్చాను..
‘అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించిన అంశంపై సమీక్ష నిర్వహించాను. సెప్టెంబరు నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టమని ఆదేశాలు ఇచ్చాను. మనం రూ.1150 కోట్లు ఇస్తామని చెప్పాం. అగ్రిగోల్డ్‌ యజమానుల ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, తర్వాత వేలం ద్వారా సొమ్మును రికవరీ చేస్తాం. మిగిలిన డబ్బులన్నింటినీ కూడా బాధితులకు ఇస్తాం. బాధితులకు మంచి చేయడానికి ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రతి నెలా నెలా చెల్లింపులు చేయమని ఈ ఉదయమే ఆర్థికశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చాను. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితాను తీసుకోండి. గ్రామ వాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డ్‌ బాధితులకు రశీదులు ఇవ్వాలి’ అని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు