నేడు విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌

28 Dec, 2019 04:33 IST|Sakshi

అధికార వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ఉక్కునగరానికి ముఖ్యమంత్రి 

దాదాపు రూ.1,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖ ఉత్సవ్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌)గా విశాఖ నగరం కావొచ్చంటూ సీఎం ఇటీవల అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించనున్నారు.

సీఎం పర్యటన సాగేదిలా..
సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 3.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి 3.50 గంటలకు కైలాసగిరి వెళ్తారు. వీఎంఆర్‌డీఏ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక అక్కడినుంచి బయల్దేరి డాక్టర్‌ వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కుకు చేరుకుంటారు. అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని  విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు