శ్రీకాకుళం: రేపే సీఎం జగన్‌ జిల్లా పర్యటన

5 Sep, 2019 15:12 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా పర్యటించనున్నారు. ఆయన పలాస– కాశీబుగ్గలో పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటీలోని పలు భవనాలను ప్రారంభించిన అనంతరం శ్రీకాకుళం రూరల్‌ సింగుపురం వద్ద గల అక్షయ పాత్ర వంటశాలను ప్రారంభిస్తారు. సవివరమైన టూర్‌ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి ఓఎస్‌డీ విడుదల చేశారు. 

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉదయం 9.30 గంటలకు విమానంలో బయలుదేరి 10.15  గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు కాశీబుగ్గ చేరుకుంటారు.  ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కాశీబుగ్గ డీఎస్‌పీ కార్యాలయం దగ్గర గల పోలీస్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.05కు కాశీబుగ్గ పోలీస్‌ గ్రౌండ్‌ నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్‌కు బయలుదేరి 11.10కి చేరుకుంటారు. 11.10 గంటల నుంచి 1 గంట వరకు.. ఉద్దానం తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద గల ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి, పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రిసెర్చి సెంటర్‌ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కాశీబుగ్గ రైల్వే గ్రౌండు నుంచి కాశీబుగ్గ పోలీస్‌ గ్రౌండుకు వచ్చి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 1.40కు హెలికాప్టర్‌లో ఎచ్చెర్ల ఏఆర్‌ పోలీస్‌ గ్రౌండ్‌కి చేరుకుంటారు. 1.45కు బయలుదేరి ఎస్‌ఎం పురం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు 1.50కు చేరుకుంటారు. 

1.50 నుంచి 2. 40 వరకు మధ్యాహ్న భోజన విరామం
ఆ తర్వాత 2.40 నుంచి 3.40 వరకు.. ట్రిపుల్‌ ఐటీలోని అకడమిక్, వసతి గృహ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 3.40కు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద గల అక్షయపాత్ర వంట కేంద్రానికి బయిలుదేరుతారు. 3.55 నుంచి 4.30 గంటల వరకు సింగుపురంలోని అక్షయపాత్ర సెంట్రల్‌ కిచెన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  4.30కు సింగుపురం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో ఎచ్చెర్లలోని ఏఆర్‌ పోలీస్‌ క్వార్టర్సు గ్రౌండ్‌కు చేరుకుంటారు. 4.50 గంటలకి హెలికాప్టర్‌లో విశాఖపట్నం తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి విమానంలో విజయవాడ వెళతారు.   

మరిన్ని వార్తలు