సీఎం జగన్‌ చేతుల మీదగా ‘దిశా పోలీస్‌ స్టేషన్‌’ ప్రారంభం

5 Feb, 2020 17:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఈనెల 7న దిశా పోలీస్‌ స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు.

మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉ‍న్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని ప్రవేశ పెట్టామని మంత్రి సుచరిత అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఏపీలోనే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దిశ చట్టం ద్వారా శిక్ష వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు దిశా చట్టం ప్రవేశ పెట్టేందుకు చూస్తున్నాయన్నారు. దిశా చట్టంపై కేంద్రం కొన్ని టెక్నికల్‌ క్లారిఫికేషన్‌ అడిగిందని, అవి కూడా పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపామని హోంమంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు