అర్జీలతో వచ్చే అందరినీ.. మెప్పించేలా ‘స్పందన’

4 Nov, 2019 04:01 IST|Sakshi
విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు (ఫైల్‌)

మొక్కుబడి పరిష్కారం కుదరదు

ప్రజలు మెచ్చుకునేలా ఉండాలి

వినతులను పరిష్కరించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి

ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలి

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

ఇవే లక్ష్యాలుగా అధికారులకు ప్రత్యేక శిక్షణ

ఈ నెల 5 నుంచి 13 వరకు జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అర్జీదారులను మరింతగా మెప్పించే రీతిలో వారి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను మొక్కుబడిగా పరిష్కరించినట్లు కాకుండా మరింత పారదర్శకంగా.. నిజాయితీ, చిత్తశుద్ధితో పరిష్కరించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వాటిని సంబంధిత శాఖలకు పంపించేసి పరిష్కారం అయిపోయినట్లు చేయడానికి వీల్లేదని ఆయన ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఇందులో భాగంగా.. వచ్చే ప్రతీ వినతికి రశీదు ఇచ్చే దగ్గర నుంచి తుది ఎండార్స్‌మెంట్‌ వరకు ఎటువంటి విధానాలను అవలంబించాలనే దానిపై జిల్లా స్థాయి నుంచి గ్రామ సచివాలయ స్థాయి వరకు శిక్షణ ఇవ్వాలని ఆయన ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో ఈ శిక్షణకు సంబంధించి ప్రతీ శాఖ కొన్ని విధానాలను ఇప్పటికే రూపొందించుకున్నాయి. 

రేపటి నుంచి 13 వరకు శిక్షణ
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో సదస్సులు నిర్వహించారు. వీటికి కొనసాగింపుగా ఈ నెల 5 నుంచి 13 వరకు జిల్లా స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి విజయనగరంలో ఈ నెల 5న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్‌ఐలకు శిక్షణనిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ  కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, భూ పరిపాలన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ పరిపాలన, పౌరసరఫరాలు, ప్రణాళిక శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పోలీసు టెక్నాలజీ డీఐజీ హాజరుకానున్నారు. ఈ శిక్షణ ఉ.10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో..
– ప్రజల వినతులను మరింత నాణ్యతతో ఎలా పరిష్కరించాలనే దానిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వివరిస్తారు. 
– ఆ తర్వాత.. ఇంటి స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం అర్జీలు సమర్పించే వారిని సంతృప్తిపరిచే రీతిలో వాటిని ఎలా పరిష్కరించాలో వివరిస్తారు. 
– అలాగే, పోలీసు శాఖకు వచ్చే వినతుల పరిష్కార విధానాన్ని చెబుతారు. 
– ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అధికారులు బృందాలుగా ఏర్పడి నిర్దిష్టమైన ఒకవినతిని పరిష్కరించడంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి.. ఎలాంటి తప్పులు దొర్లుతున్నాయనే అంశాలపై చర్చించడంతో పాటు వాటిని అధిగమించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఇలా ప్రజలు సంతృప్తి వ్యక్తంచేసేలా వారి అర్జీలను ఎలా పరిష్కరించాలన్న దానిపై ప్రణాళికలను జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం వివరిస్తుంది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతీరోజు ‘స్పందన’
ఇదిలా ఉంటే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఇక అక్కడ ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో శిక్షణ పొందే అధికారులు ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఇది పూర్తయితే  గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారానికి గ్రామం దాటి వెళ్లాల్సిన పని ఉండదు. కాగా, ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర, జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలకు అనుసంధానమవుతుంది. 

మరిన్ని వార్తలు