పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్‌ పరామర్శ 

22 Nov, 2019 10:10 IST|Sakshi
మంత్రి మల్లాడి కృష్ణారావు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి, యానాం: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కేంద్రపాలిత ప్రాంతం యానాం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కొమానపల్లిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడి నుంచి గాడిలంక చేరుకుని, హెలికాప్టర్‌లో యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్‌ వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ రచనాసింగ్‌ తదితర అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం జగన్‌ కారులో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు గృహానికి చేరుకున్నారు. ఆయన్ను మంత్రి కృష్ణారావు సాదరంగా ఆహ్వానించారు.  

కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ కాంస్య విగ్రహానికి సీఎం జగన్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని మంత్రి మల్లాడి ఇతర మంత్రులతో సీఎం జగన్‌ సుమారు 1.15 గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాజీవ్‌ రివర్‌బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్,  ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
బారులు తీరిన జనం 
యానాం చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జనం రోడ్డులకు ఇరువైపులా వేచి ఉన్నారు. ఆయన కారులో ప్రయాణించే సమయంలో జై జగన్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం జగన్‌ సైతం కారు నుంచి వారికి రెండు చేతుల జోడించి అభివాదం చేశారు. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కూడా ప్రజలు జేజేలు పలుకుతూ అమ అభిమానాన్ని చాటుకున్నారు.
 
విస్తృత పోలీసు బందోబస్తు   
సీఎం జగన్‌ యానాం పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే రహదారులు, మంత్రి మల్లాడి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్, యానాం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయన పర్యటించే వీధులను తమ ఆ«దీనంలోనికి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు