శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

1 Oct, 2019 04:37 IST|Sakshi
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుమల : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీవీఎస్‌ఓ గోపినాథ్‌ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని వైఎస్‌ జగన్‌ దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. తన వెంట తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని రాత్రి 7.11గంటలకు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు 7.21గంటలకు చేరుకున్నారు.
తిరుమల పెద్దశేష వాహన సేవలో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం స్వామి వారి సన్నిధికి చేరుకుని ఆలయ అర్చకులకు పట్టువస్త్రాలను అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలోని వకుళామాత, ఆనంద నిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహ స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు పలికారు. అక్కడే బియ్యంతో తులాభారం మొక్కు సమర్పించారు. ఆ తర్వాత వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌.గిరీష, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం ఉన్నారు.
బియ్యంతో తులాభారం సమర్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

వైఎస్‌ కుటుంబానికి అరుదైన గౌరవం
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన గౌరవం వైఎస్‌ కుటుంబానికే దక్కింది. ఇంతకు ముందెప్పుడూ సీఎం హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టువస్త్రాలను సమర్పించిన దాఖలాల్లేవు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదు సార్లు సమర్పించారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలను సమర్పించారు.

మరిన్ని వార్తలు