'సచివాలయ ఉద్యోగాలు'.. 30న నియామక పత్రాలు

28 Sep, 2019 04:12 IST|Sakshi

తొలి నియామక పత్రాన్ని అందించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పంపిణీ

తూర్పు గోదావరిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనవారందరికీ ఈ నెల 30న ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందిస్తారు. జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెప్పారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొని.. అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్‌ 30 నాటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తికాని వారికి వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కాగా, శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగింది. కృష్ణా జిల్లాతో సహా నాలుగైదు జిల్లాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలతో షార్ట్‌ లిస్టుల జాబితా వెల్లడి పూర్తి కాగా, మిగిలిన జిల్లాల్లో శనివారం నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కేటగిరీ –1 ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఆ నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లిష్టతతో కూడుకోవడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు. 

తూర్పు గోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడతారని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 2న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని వివరించాయి.  

మరిన్ని వార్తలు