కరుణకు, దాతృత్వానికి ప్రతీక.. రంజాన్‌

24 May, 2020 21:45 IST|Sakshi

ముస్లింలకు సీఎం వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి‌ శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

► రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు పాటించారన్నారు. ఈ విపత్కర కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. 
► నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుకన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. 
► మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా