'ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి'

21 Apr, 2020 14:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కరోనా కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటను సరైన ధరకు కొనుగోళ్లు చేసి వారికి అండగా నిలబడాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారుల కోసం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడానని పేర్కొన్నారు. తెలుగు మత్స్యకారులును అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో చెప్పారని వెల్లడించారు. (వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్‌ఓ)

అంతకుముందు కరోనా నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం ఊపందుకుందన్నారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారిగా మాస్క్‌లును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా నిలిచాయని, ఇంతవరకు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కాగా సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కరోనా పరీక్షలను(ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా)నిర్వహించామన్నారు. కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించామని, గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఉన్నవారిని మిగతా ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.

కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఎక్కువ స్టాక్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందిలో ఇప్పటికే 2వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, మిగతావారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు