నిర్దేశించిన రేట్లకు రొయ్యలు కొనాల్సిందే

5 Apr, 2020 04:28 IST|Sakshi

ఆక్వా ఉత్పత్తులు, రైతుల సమస్యలపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

కరోనా పేరుతో రైతులకు నష్టం కలిగిస్తే సహించం

కేంద్రం నుంచి ఆక్వా రైతులకు సాయంపై సూచనలు

ఆక్వా జోన్లలో మంత్రి, అధికారుల పర్యటనకు ఆదేశం

ఐదు రోజుల్లో 2,832 టన్నుల కొనుగోలు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ,  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత, వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ వి.విజయసాయిరెడ్డి, ఎంపెడా చైర్మన్‌ కేఎస్‌ శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులెవరూ నష్టపోకూడదని ఎంపెడా చైర్మన్‌కు సీఎం స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ పేరుతో రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని  హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించాలని సీఎం  ఆదేశించారు. దీనికి సంబంధించి ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపెడా చైర్మన్‌ సీఎం దృష్టికి తెచ్చారు. 

రాష్ట్రం నుంచే భారీగా ఎగుమతులు 
ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఎంపెడా చైర్మన్, అధికారులను సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల్లో అధికభాగం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న నేపధ్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ధరలు తగ్గినప్పుడు రైతులు నేరుగా కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసుకునేలా ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందేలా చూడాలని సీఎం సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ తరహాలోనే ఆక్వాజోన్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈనాం వ్యవస్థను తెచ్చి సచివాలయాలను, సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, కోల్డ్‌ స్టోరేజీలు, ఎగుమతులు తదితర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. గత ఐదురోజుల్లో 2,832 మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరగగా 2,070 మెట్రిక్‌ టన్నులు ఎగుమతి చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా