సీఆర్‌డీఏపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

26 Jun, 2019 08:01 IST|Sakshi

సన్నాహక సమావేశం నిర్వహించిన మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి రాజధానిపై సమావేశం నిర్వహిస్తుండడంతో సీఆర్‌డీఏ అధికారులు నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని రాజధాని పనులు, వ్యవహారాలకు సంబంధించి నివేదిక తయారు చేసి ఆయనకు వివరించేందుకు సిద్ధమయ్యారు. సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం వివిధ విభాగాల అధికారులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సన్నాహక సమావేశం నిర్వహించారు.

మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ప్రధానంగా రాజధాని ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం కావాలని ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థలతో జరిపిన సంప్రదింపులు, ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన రూ.128 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన రూ.128 కోట్ల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో జరిగే సమావేశంలో రాజధానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

ఐదు రోజుల పనిదినాలు.. మరో ఏడాది అమలు
సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అంగీకరించారు. ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఐదు రోజుల పనిదినాలను పొడిగించేందుకు సీఎం అంగీకరించడంపై ప్రభుత్వ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. (చదవండి: విలక్షణ పాలనకు శ్రీకారం)  

మరిన్ని వార్తలు