‘దిశ’పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

14 May, 2020 19:47 IST|Sakshi

6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు

సాక్షి, అమరావతి: ‘దిశ’ అమలు కోసం ప్రత్యేక వాహనాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అదే విధంగా వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ‘దిశ’పై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న అంశంపై ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సూచించారు. అలాగే స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే కాకుండా మిగతా ఫోన్లలో కూడా ‘దిశ’ యాప్‌ సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం సంబంధిత కంపెనీలతో మాట్లాడాలని ఆదేశించారు. (వలస కూలీలపై సీఎం జగన్‌ ఆవేదన)

ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి డీ- అడిక్షన్‌ సెంటర్‌
‘‘దిశ చట్టం రాష్ట్రప్రతి ఆమోదం పొందేలా చూడాలి. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలి. కేసుల విచారణ వేగంగా జరిగేలా చూడాలి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక డీ-అడిక్షన్‌ సెంటర్‌ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న 11 , కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్‌ ఆస్పత్రుల్లో డీ- అడిక్షన్‌ సెంటర్‌ కూడా ఒక విభాగంగా కలుపుకుని నిర్మాణాలు చేపట్టాలి. తద్వారా శాశ్వత ప్రాతిపదికన డీ- అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు అవుతుంది. వన్‌ స్టాప్‌ సెంటర్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా ఇందులో భాగం చేయాలి. వన్‌ స్టాప్‌ సెంటర్లను కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దిశ పోలీస్‌స్టేషన్లు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి ఉండేలా చూడాలి. ‘దిశ’పై ప్రతి నెలా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు
అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. వీటిని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల జారీని సౌత్‌ ఇండియా ఐఎస్‌ఓ జనరల్‌ మేనేజర్ డాక్టర్‌ ఎలియాజర్ వివరించారు. కాగా విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్‌ పోలీస్‌స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు కూడా ఈ సర్టిఫికెట్‌ లభించనుంది. సర్టిఫికెట్ల ఆవిష్కరణ అనంతరం 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీలు, ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

‘‘167 కేసులు వారం రోజుల్లో డిస్పోజ్‌ చేశామని అధికారులు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంది. మీరు చాలా ఎఫెర్ట్‌ పెట్టారు. దీని వల్ల ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపిస్తున్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ, మరియు ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. చాలా బాగా పనిచేస్తున్నారు. అయితే మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. దిశ యాక్ట్, స్పెషల్‌ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం. అలాగే ఫోరెన్సిక్‌ సిబ్బంది నియామకం, ల్యాబ్‌ నిర్మాణం కోసం నిధులు కూడా విడుదల చేశాం. ప్రతి దిశ పోలీస్‌స్టేషన్లలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూస్తాం.(కువైట్‌ నుంచి వలస కార్మికులను రప్పించండి)

నెలకోసారి ‘దిశ’పై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే. మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం. మనకు హోం మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్‌ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కూడా మహిళలే. ‘దిశ’ ప్రవేశపెట్టిన జనవరి నుంచి చురుగ్గా కార్యకలాపాలు. 7 రోజుల్లోగా ఛార్జిషీటు నమోదు. త్వరితంగా శిక్షల ఖరారులో ముందడుగు. మహిళలపై నేరాలు 134, చిన్నారులపై నేరాలు 33. 167 కేసుల్లో 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు. 3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో శిక్షలు. ఇందులో 2 మరణశిక్షలు. 5 జీవిత ఖైదులు. 20 ఏళ్ల శిక్ష 1, ఏడేళ్ల శిక్ష 5,3 ఏళ్ల శిక్ష పడ్డ కేసులు 3. మూడునెలల శిక్ష 3. జువనైల్‌హోంకు ఒకరిని పంపారు’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ప్రత్యేక కోర్టులు లేకున్నా.. సరైన ఆధారాల సేకరణ, వేగవంతమైన విచారణల కారణంగా ఈ శిక్షలు పడేలా చేయగలిగామని అధికారులు తెలిపారు.

‘‘దిశ యాప్‌ను 2.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 19,918 ఎస్‌ఓఎస్‌ రిక్వెస్ట్‌లు రిసీవ్‌ చేసుకున్నాం. ఫిబ్రవరి 9 నుంచి 292 ఘటనల్లో చర్యలు. 68 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు. భర్త ద్వారా వేధింపులు 93. మహిళలపై వేధింపులు 42. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వేధింపులు. 42 బంధువుల ద్వారా వేధింపులు. 29. ఇతరుల ద్వారా వేధింపులు. 21. పబ్లిక్‌ న్యూసెన్స్‌ . 17 ఫేక్‌ కాల్స్‌. 15 చిన్నారులపై వేధింపులు. 8 మహిళల అదృశ్యం. 7 సివిల్‌ వివాదాలు. 7 బాలికల అదృశ్యం. 5 మిగిలినవి ఇతర కేసులు. 100,112,191 దిశ ఎస్‌ఓఎస్‌ కాల్స్‌ ద్వారా సహాయం కోసం ఏ మహిళ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రికి తెలిపారు. ‘‘మహిళలు, చిన్నారుల పట్ల స్నేహ పూర్వక వాతావరణం. ప్రత్యేక పీపీపీలతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోగా శిక్షలు వేయించేలా చర్యలు. గృహ హింస, మద్యపానం వల్ల చోటుచేసుకున్న హింసలపై ప్రత్యేక దృష్టి. విస్తృతంగా కౌన్సెలింగ్‌’’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసులు, వాలంటీర్ల భాగస్వామ్యం కానున్నారు.

మహిళలపై నేరాలు తగ్గాయి: సుచరిత
‘‘దిశ చట్టం ఆమోదం. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలిసారిగా 6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు వచ్చాయి. చట్టం అమలు తీరుపై దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దిశ అమలు కోసం ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని నియమించుకోవాలని సీఎం ఆదేశించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దిశ చట్టం ఏర్పాటు చేశాక మహిళలపై నేరాలు తగ్గాయి’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు