మంచి విద్య.. మెరుగైన ఉద్యోగం

28 Jun, 2019 04:09 IST|Sakshi

విద్యా వ్యవస్థ లక్ష్యం ఇదే కావాలి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఉద్యోగ కల్పన కేంద్రాలుగా కాలేజీలు, వర్సిటీలు

సిలబస్, కోర్సుల్లో మార్పునకు ఉన్నత కమిటీ

ఏడాదిలోగా వర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ 

విద్య అన్నది వ్యాపారం కాదు.. రీయింబర్స్‌మెంటు వాస్తవిక దృక్పథంతో అమలు

విజయనగరం, ఒంగోలు వర్సిటీలు మూడేళ్లలో పూర్తి చేస్తాం

అరుకులో గిరిజన వర్సిటీ, మెడికల్‌ కాలేజీ

గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం

అడ్డగోలుగా ప్రైవేటు వర్సిటీలకు భూములు

విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విద్యార్థులు పాఠశాలల్లో చేరిన దగ్గర నుంచి ఉద్యోగాలు సంపాదించే స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇది తనకు అత్యంత ప్రాధాన్యతా అంశమని స్పష్టం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచి వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఉన్నత విద్య, దీన్ని బోధిస్తున్న సంస్థలు, ఎయిడెడ్‌ కాలేజీల్లో పరిస్థితులు తదితర అంశాలమీద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ బలంగా లేకపోతే పేదలు, మధ్య తరగతి పిల్లలు చదువుకోలేరని, అందువల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థను బతికించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు ఉండాలని, నాణ్యమైన విద్య అందించాలన్నారు. గత ప్రభుత్వం కావాలనే ఈ రంగాన్ని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యానించారు

యూనివర్సిటీల దశ, దిశ మార్చండి..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను దెబ్బతీశారని, ఫలితంగా ప్రైవేటు కాలేజీల్లో లక్షలాది రూపాయలు పోసి చదువుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫీజులు భరించలేక విద్యార్థులు చదువులు మానుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల దశ, దిశ మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు పెంచి వాటి ప్రతిష్టను ఇనుమడింపచేయాలని సీఎం గట్టిగా చెప్పారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి నివేదించారు.

వీసీల నియామకానికి సంబంధించి సెర్చి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నెలరోజుల్లోగా పూర్తి పారదర్శక విధానంలో అర్హత, అనుభవం ఉన్న వారిని వీసీలుగా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, ఇతర అధ్యాపక, సిబ్బంది పోస్టులను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భర్తీల విషయంలో అవినీతికి, పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల న్యాక్‌ గ్రేడ్‌ పెరిగేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచి విద్యార్థులకు తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపాలని అధికారులకు సూచించారు.

ఫీజులను ప్రామాణీకరించాలి
ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తరువాత ఉన్నత విద్య చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. కాలేజీల ఫీజులు, ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, దీన్ని పరిశీలించి ప్రామాణీకరించాలని (స్టాండర్‌డెజ్‌) ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఫీజుల నిర్ధారణ వాస్తవిక దృక్పథంతో ఉండాలని అభిప్రాయపడ్డారు. లేకుంటే పేద, మధ్యతరగతి పిల్లలు ఫీజులు భరించలేరన్నారు. ‘ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థికి ఏటా రూ. 33 వేలు ఖర్చు అవుతుందని ప్రభుత్వమే నిర్ధారించి, ఆ మేరకు రీయింబర్స్‌మెంటును ఖరారు చేసింది. అదే సమయంలో కొన్ని కాలేజీలు ఏటా రూ. 70 వేల నుంచి రూ. 1 లక్ష వరకు కూడా ఫీజుల వసూలుకు మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది. ఈ పద్ధతి మారాలి. విద్య అన్నది వ్యాపారం కాదు. దాన్ని లాభార్జన రంగంగా చూడకూడదు. దేశంలో చట్టం కూడా అదే చెబుతోంది’ అని సీఎం పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంటు కింద కాలేజీలకు అందాల్సిన డబ్బులు కనీసం మూడు నెలలకోసారైనా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే ఆ కాలేజీలు కూడా సక్రమంగా నడుస్తాయని అక్కడ పనిచేస్తున్న వారికి సకాలానికి వేతనాలు అందుతాయని పేర్కొన్నారు.
భూములు పొంది, సంస్థలు ఏర్పాటు చేయని

వాటి వివరాలు సేకరణ..
రాజధాని ప్రాంతంలో ప్రైవేటు యూనివర్సిటీలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కేటాయింపు అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఒక విధానం లేకుండా ఇష్టానుసారం గత ప్రభుత్వం భూములు కేటాయించిందని సీఎం వ్యాఖ్యానించారు. భూములు పొంది, సంస్థలను ఏర్పాటు చేయని వారి వివరాలను తయారుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒంగోలు, విజయనగరంలలో యూనివర్సిటీలు పెడతామంటూ ఎన్నికలకు ముందు హడావుడిగా జీవోలు ఇచ్చారని, కానీ వాటి నిర్మాణం, సిబ్బంది నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మూడేళ్లలో వాటి ఏర్పాటు పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఉద్యోగ కల్పన కేంద్రాలుగా వర్సిటీలు, కాలేజీలు
చదువు పూర్తిచేసుకుని బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకునేలా విద్యావ్యవస్థ ఉండాలని, వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెంచి, వాటిని ఉద్యోగ కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ దిశగా సిలబస్‌లో మార్పులు చేయాలని, సిలబస్‌ను మెరుగుపరచడానికి ఒక కమిటీని వేయాలని ఆదేశించారు. కొత్త సిలబస్‌ వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి రావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేముందు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వారి అర్హతలను నిర్ధారించాలని, ఏపీపీఎస్సీ నిర్దేశించుకున్న అర్హతలను ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు.

పార్లమెంటు నియోజకవర్గానికో వృత్తి నైపుణ్య కేంద్రం
విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఏ కోర్సులు పెట్టాలి, ఎలా అమలు చేయాలన్న ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని ఈ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. అదే సమయంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కోర్సులను మెరుగుపరచాలన్నారు. విశాఖపట్నం జిల్లా అరకులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని, మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ రెండు విద్యాసంస్థలను గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటుచేయడం సముచితమని అభిప్రాయపడ్డారు.

రూ. 1,000 కోట్ల రూసా నిధులు కోల్పోయాం
రూసా గ్రాంటు కింద కేంద్రం గత ఏడాది రూ. 67 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విడుదల చేయకుండా వేరే ఖర్చులకు దారి మళ్లించిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఏయూ, ఎస్వీ వర్సిటీలు న్యాక్‌ ఏ ప్లస్‌ గుర్తింపు ఉన్నాయని, అవి 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే రూసా కింద రూ. 1,000 కోట్లు అందేవని, దాన్ని రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఇలా కావడం విచారకరమని, ఇలా చేస్తే  విద్యాసంస్థలు ఎలా మెరుగుపడతాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. వర్సిటీలలో మౌలిక సదుపాయాలకు ఎంత కావాలన్నా కేపిటల్‌ గ్రాంటుగా తాము ఇస్తామని, మొత్తం అన్ని యూనివర్సిటీలు న్యాక్‌ ఏప్లస్‌ గ్రేడులోకి తీసుకురావాలని  ఆదేశించారు.

ట్రిపుల్‌ ఐటీ నిధులూ పక్కదారి
ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలను అధ్వానంగా మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రూ. 400 కోట్లు ఉంటే అందులో రూ. 260 కోట్లు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీల భవనాల నిర్మాణానికి నిధులు లేకుండా పోయాయని, ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలమంది విద్యార్థులను ప్రైవేటు భవనాల్లో ఉంచారని పేర్కొన్నారు. కాలేజీల అభివృద్ధిపై చర్చ సందర్భంగా జిల్లాకొక కాలేజీని రూ. 15 కోట్లతో అభివృద్ధి చేయిద్దామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు. కొన్ని కాలేజీలనే అభివృద్ధి చేసే బదులు మౌలికంగా ముందుగా అవసరమయ్యే మంచి నీరు, ఫర్నీచర్, ఫ్యానులు, బ్లాక్‌బోర్డులు, ప్రహరీలు, పెయింటింగ్‌లు తదితర 9 అంశాల్లో అన్ని కాలేజీలను మెరుగుపర్చాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. స్కూళ్ల మాదిరిగానే కాలేజీల ప్రస్తుత ఫొటోలు తీసుకొని రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. వర్సిటీల పాలకమండళ్లను నెలరోజుల్లో పునర్నియమిస్తామని సీఎం తెలిపారు. 7వ పీఆర్సీకి సంబంధించి బకాయిలకు రూ. 340 కోట్లు అవసరమని అధికారులు పేర్కొనగా సీఎం ఇస్తామన్నారు.

ట్రిపుల్‌ ఐటీలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సహకారం
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటుచేస్తే వాటిని చేజేతులా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఐటీల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ పాదయాత్రలో తన వద్దకు వచ్చి విద్యార్థులు గోడుబెళ్లబోసుకున్నారని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో వెంటనే పనులు పూర్తిచేయాలని, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీ పనులు త్వరితంగా మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీల్లో చదివే విద్యార్థుల్లో 50 శాతం మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితులు మారాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ట్రిపుల్‌ ఐటీలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. సమీపంలోని రిజర్వాయర్ల నుంచి డైరెక్టుగా పైపులైనులు వేసి నీళ్లందించే ప్రయత్నాలు చేయాలన్నారు. ట్రిపుల్‌ ఐటీల్లో ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా విద్యాశాఖ మంత్రి, అధికారులు ఆయా క్యాంపస్‌లను తరుచూ సందర్శించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు