పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం

21 May, 2020 04:10 IST|Sakshi

ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

రియల్‌ టైమ్‌లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి

నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు భారీ జరిమానా 

జనాభా ఉన్న ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలు రాకుండా చూడాలి

అవినీతికి తావివ్వరాదు

నిపుణులను భాగస్వామ్యం చేస్తూ పటిష్ట చట్టం తీసుకురావాలని ఆదేశం

న్యాయనిపుణులను భాగస్వామ్యం చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలి. ప్రతి కంపెనీ ఏటా పీసీబీ సూచనల అమలుపై ఒక రిపోర్టు ఇచ్చేలా చూడాలి. వాటిని థర్డ్‌ పార్టీ ఆడిటర్‌ ద్వారా సమీక్షించే విషయాన్ని పరిశీలించాలి. థర్డ్‌ పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన అంశాలపై పీసీబీ దృష్టి సారిస్తూ.. ఆ నివేదికలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి. 

వ్యర్థాలు, కాలుష్య కారకాలు, జలాలను పద్ధతి ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది వస్తుంది. శాస్త్రీయ విధానాలతో కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుంది. అందువల్ల కొంత మొత్తాన్ని కంపెనీలు చెల్లించేలా విధానం ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. (23 నుంచి 30 వరకు వైఎస్సార్‌సీపీ సేవా కార్యక్రమాలు)
ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

► రెడ్, ఆరెంజ్‌ జాబితాలో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ)కు నిరంతరం రియల్‌ టైం డేటా రావాలి. అయితే వస్తున్న డేటాను విస్మరించడం అనేది మన వ్యవస్థల్లో పెద్ద లోపంగా ఉంది. ఈ డేటా ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. సత్వర చర్యలు అవసరం.
► రసాయనాల నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, ప్రమాదకర రసాయనాలు.. తదితర అంశాలపై ఎప్పటి కప్పుడు డేటాను స్వీకరించాలి. దీంతో పాటు.. ప్రఖ్యాత, విశ్వసనీయ సంస్థకూ ఈ డేటా పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలి.
► నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్య కారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ కావాలి. ఈ హెచ్చరికలు ఎవరెవరికి వెళ్లాలన్న దానిపై ఒక స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలి. కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్లాలి.
► హెచ్చరికలు జారీ అయ్యాక తగిన చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి జరిగిన నష్టం మేరకు జరిమానా విధించాలి. నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే షాక్‌ కొట్టేలా మరింత జరిమానా విధించాలి. ఈ ప్రక్రియలో ఎక్కడా అవినీతికి చోటు ఉండరాదు. 
► ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (పోలవరం పనులు వేగవంతం )

పర్యావరణ పరిరక్షణ కోసం హరిత నిధి
► ఒక పక్క పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూనే మరో పక్క పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్‌ ఫండ్‌ (హరిత నిధి)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమలు ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 
► రెడ్, ఆరంజ్‌ విభాగాల్లోని పరిశ్రమల్లో కాలుష్యాన్ని కొలిచే అన్ని రకాల పరికరాలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ సమాచారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అనుసంధానం అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. స్వల్ప నిబంధనలు ఉల్లంఘించినా భారీ పెనాల్టీ భరించాల్సి ఉంటుంది. 
► ఎన్విరాన్‌మెంట్‌ డ్యామేజ్‌ కాంపెన్‌సేషన్‌ (ఈడీసీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడం తోపాటు పాత పరిస్థితులను తీసుకురావడానికి అయ్యే వ్యయాన్ని ఈడీసీ అంచనా వేస్తుంది. ఆ మొత్తాన్ని గ్రీన్‌ ఫండ్‌లో జమ చేసి పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలి. 

మరిన్ని వార్తలు