‘రూ. కోటి దాటి కొనుగోలు చేస్తే.. వెబ్‌సైట్‌లో పెట్టాలి’

14 Aug, 2019 17:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ కొనుగోళ్లలో అక్రమాలకు, స్కామ్‌లకు తావులేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతపై చర్చించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘కోటి రూపాయలు దాటి ఏం కొనుగోలు చేసినా.. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో కూడా పొందుపర్చాలి. అదే సమయంలో అంతకంటే తక్కువకు కోట్‌ చేయదలుచుకునేవారికి ఆ కాంట్రాక్టు ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వ విధానం దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ స్కామ్‌లకు అవకాశం ఉండకూడదు. వ్యవస్థను శుద్ది చేయడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నందునా.. వాటికి కచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. దీనిపై అధికారులు ఆలోచన చేసి ఒక పరిష్కారాన్ని చూపాలి. ఏదైనా కొనుగోలు జరపాలన్నప్పుడు.. టెండర్లను ఆహ్వానించాలి. టెండర్‌ పలానా వారికి ఇస్తున్నామని ఖరారైన తర్వాత... ఆ రేటును వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. తర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు కొంత సమయం ఇవ్వాలి. అలాగే కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధికారులు అధ్యయనం చేయాల’ని అన్నారు. అలాగే ఈ అంశాలపై  చర్చించడానికి ఆగస్టు 28న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష..
అగ్రికల్చర్‌ మిషన్‌పై కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవయసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌, వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ నాగిరెడ్డిలు హాజరయ్యారు. 

>
మరిన్ని వార్తలు