రోజూ 17,500 పరీక్షలు

20 Apr, 2020 03:12 IST|Sakshi
తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

త్వరలో పెరగనున్న పరీక్షల సామర్థ్యం  

కోవిడ్‌–19 నియంత్రణపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కరోనా నియంత్రణ చర్యలపై విష ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి

సర్వేలో గుర్తించిన 32 వేల మందికి త్వరగా పరీక్షలు పూర్తి చేయాలి

ఆస్పత్రుల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలి

దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, వారం పది రోజుల్లోనే రోజుకు 17,500 పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు  చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు కరోనా పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలిపారు. శనివారం ఒక్కరోజే 5,508 పరీక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై సీఎం ఆదివారం తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. 

వారందరికీ బీమా రక్షణ..
వలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఇలా వైరస్‌పై పోరాటంలో ముందు వరుసలో ఉన్నవారందరికి కరోనా బీమా రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వారికి భరోసా ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ యుద్థంలో వారంతా వెలకట్టలేని సేవలందిస్తున్నారని, కోవిడ్‌–19 నియంత్రణలో వారి పాత్ర ప్రశంసనీయమని సీఎం పేర్కొన్నారు.

ప్రతి 10 లక్షల మంది జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న ర్యాపిడ్‌ కిట్లను వినియోగించకుండానే ఈ స్థాయికి చేరుకున్నామని, మూడు నాలుగు రోజుల్లో టెస్టుల సంఖ్య పెరుగుతుందని వివరించారు. వారం పది రోజుల్లోగా రాష్ట్రంలో రోజుకు 17,500కి పైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని చేరుకుంటామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రానికి చేరుకున్న ర్యాండమ్‌ కిట్లను 2 రోజుల్లో వినియోగించడం ప్రారంభిస్తామన్నారు. రెడ్‌ జోన్లలో ర్యాండమ్‌ సర్వే చేయడంతోపాటు కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారిని కూడా పరీక్షిస్తామని చెప్పారు.  
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన మాస్కులతో సీఎం వైఎస్‌ జగన్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌  తదితరులు 

32 వేల మందికి పరీక్షలు...
ఇంటింటికి తిరిగి కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32 వేల మందికి పరీక్షలు పూర్తి చేస్తే ఒక అవగాహన ఏర్పడుతుందని, దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కరోనా  కేసుల సంఖ్య, తీసుకుంటున్న జాగ్రత్తలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

విష ప్రచారాన్ని తిప్పికొట్టండి..
కరోనాను కట్టడి చేసేందుకు పోరాడుతూనే విష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి మరో పోరాటం చేయాల్సి వస్తోందని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై జరుగుతున్న విష ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు.

ఆస్పత్రుల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు..
ఆస్పత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించి రెండు మూడు రోజులకు ఒకసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం సూచించారు. సీఎం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు