‘రైతులకు ప్రభుత్వం ఉందనే భరోసా ఇవ్వాలి’

14 Aug, 2019 20:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా ప్రభుత్వం ఉందనే భరోసా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. కౌలు చట్టంపై రైతులకు, కౌలు రైతులకు గ్రామ వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఉద్దేశించిన పథకాలు సక్రమంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్‌ మిషన్‌పై బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్‌ పెట్టాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అక్కడ పరిశీలించాలి. ఆ తర్వాతే వాటిని గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. అందులో ఏమైనా నకిలీవి ఉంటే అక్కడికక్కడే వాటిని గుర్తించాలి. గ్రామాల్లోని దుకాణాల్లో అగ్రి ల్యాబ్స్‌లో పరీక్షించిన ఉత్పత్తులను మాత్రమే ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు మాత్రమే వీటిని సరఫరా చేయాలి. ఈ విధానంపై పూర్తిగా సమీక్షించి ఖరారు చేయాలి. ఈ ప్రతిపాదనలను మిషన్‌ సభ్యుల అందరికీ ఇవ్వండి. అలాగే దీనిపై ఆలోచనలు చేయండి. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందడం కోసమే తపన పడుతున్నాం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు చక్కటి శిక్షణ ఇవ్వాలి. ఆక్వాలో కూడా నకిలీ విత్తనాలు, నకిలీ ఫీడ్‌ ఉండకూడదు. ఎరువులను, విత్తనాలు అమ్మే దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేయాలి. దుకాణాల వద్ద రైతులకు అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలి. అలాగే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా తగిన చర్యలు తీసుకోవాలి. కరువు పీడిత ప్రాంతాల్లో ఎక్కువగా చిరుధాన్యాల సాగు చేపట్టేలా కృషి చేయాలి. అంతేకాకుండా సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలి. 

పొగాకు సహా కొన్ని రకాల పంటలతో రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. అటువంటి పంటలను గుర్తించి.. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమిస్తున్నాం. పంటలు, గిట్టుబాటు ధరలపై వాళ్లు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఆక్వా ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పడు మారుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనించాలి. రైతుకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఉందనే భరోసా ఇవ్వాలి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడి డబ్బులు కూడా ఏర్పాటు చేయాల’ని అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అరికట్టడానికి వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటు జరుగుతోందన్నారు. రబీ కోసం 4.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్దం చేశామని.. ఇందుకోసం రూ. 128.57 కోట్లు​ ఖర్చు చేశామని చెప్పారు. అలాగే కౌలు రైతుల చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీఎంకు అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 16 నుంచి కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు. 

జలాశయాల్లోని నీటి నిల్వపై సీఎం ఆరా..
అలాగే రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులను సీఎం వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అన్ని రిజర్వాయర్లను నింపాలని అధికారులను ఆదేశించారు. వరద వచ్చే నెల రోజుల్లో నీటిని నింపేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

భూమి భద్రతకు ముఖ్యమంత్రి పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చారు : నాగిరెడ్డి
ఈ సమీక్ష అనంతరం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్‌ 2 నుంచి రైతు భరోసా అమలు చేయాలనే అంశంపై చర్చ సమావేశంలో జరిగిందని తెలిపారు. అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటుపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిందని చెప్పారు. పంటల బీమా ప్రీమియం కాల్వల్లో గుర్రపు డెక్కల తొలగింపు యుద్ద ప్రతిపాదకన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని తెలిపారు. భూమి భద్రతకు పూర్తి స్థాయి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు