అడ్డుకున్న వారికి కూడా ఇదే పరిస్థితి రావొచ్చు: సీఎం జగన్‌

30 Apr, 2020 14:01 IST|Sakshi

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్‌ సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఘటన అమానవీయమని.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన వాళ్లు ఉంటే ఎలా స్పందిస్తామో.. ఇతరులు ఉన్నప్పుడు కూడా అలాగే స్పందించాలని కోరారు. (అందరూ అదే మాట.. నిజం చెప్పిన నేత)

‘‘కరోనా వస్తే భయానకమనో, అది సోకినవారిని అంటరాని వారుగానో చూడవద్దు. వైరస్‌ సోకితే సరైన చికిత్స, మందులు తీసుకుంటే నయమైపోతుంది. రాష్ట్రం, దేశం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది డిశ్చార్జి అవుతున్నారు. నయం అయితేనే కదా... వాళ్లు డిశ్చార్జి అయ్యేది?. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపైనే వైరస్‌ అధిక ప్రభావం చూపుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. చికిత్స తీసుకుంటే మహమ్మారిని కట్టడి చేయవచ్చు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26 శాతంగా ఉందంటే.. మిగతా వాళ్లు కోలుకుంటున్నట్లే కదా? కరోనా ఎవరికైనా సోకవచ్చు. అంతిమ సంస్కారాలు అడ్డుకున్న వారికి ఇలాంటి పరిస్థితితే రావొచ్చు. దయచేసి ఎదుటి వారి పట్ల సానుభూతి చూపండి’’ అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.(సమర్థవంతంగా టెలి మెడిసిన్)

మరిన్ని వార్తలు