మంచి టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురండి: సీఎం జగన్‌

11 Sep, 2019 15:05 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సెక్రటేరియట్‌కు ప్రత్యేకంగా ఒక నంబర్‌ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి సన్నాహకాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు నెలల వ్యవధిలో 4 లక్షలకు పైగా నియామకాలు చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లకు ఉద్దేశించిన కాల్‌ సెంటర్‌లలో ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతీ శాఖ సహకారం అందించిందని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ సీఎంకు తెలిపారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్‌ సెంటర్‌ను సిద్ధంచేస్తున్నామని..సెప్టెంబరు చివరి వారంలో పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్రమంలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. 

ఈ సందర్భంగా... గ్రామ సచివాలయ ఉద్యోగుల జాబ్‌ చార్టులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను సమకూర్చారా? లేదా? అని ఆరా తీశారు. ‘72 గంటల్లోగా సమస్యను తీర్చడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ కూడా ఉండాలి. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించాలి. గ్రామ సెక్రటేరియట్‌కు, సెక్రటేరియట్‌కు అనుసంధానం ఉండాలి. గ్రామ సెక్రటేరియట్‌నుంచి సంబంధిత శాఖాధిపతికి అప్రమత్తత చేసేలా వ్యవస్థ ఉండాలి. ఎమ్మార్వో లేదా ఎండీఓ, కలెక్టర్, అలాగే సంబంధిత శాఖ సెక్రటరీ... ఇలా వీరందరితో గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం ఉండాలి అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

అదే విధంగా... జాబ్‌చార్టు ప్రకారం గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేటాయించిన విధులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా, తోడ్పాడు అందించేలా ఉండాలి. ప్రజలకు పూర్తిగా అండగా ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్‌ చాలా ముఖ్యం. నాలుగు లక్షలమందితో పనిచేయించుకోవడం చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. మానిటరింగ్, సమీక్ష లేకపోతే... ఫలితాలు రావన్న విషయాన్ని గుర్తించుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురండి’ అని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయండి
సంక్షేమ పథకాల అమలు ప్రణాళికను సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారుల ఎంపిక పూర్తయ్యిందా లేదా అన్న అంశం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో ఇళ్లస్థలాలపై వాలంటీర్ల సర్వే పూర్తయ్యిందని అధికారులు ఆయనకు తెలిపారు. అదే విధంగా రైతు భరోసా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరగాలి. లబ్దిదారుల జాబితాను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఒకే నమూనాలో ఉండేలా చూడండి. ప్రతి గ్రామ సచివాలయంలో రైతులకు వర్క్‌షాపు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒక షాపు కూడా ఉండాలి. ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై సచివాలయాల్లో రైతులకు అవగాహన కల్పించాలి అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 

పారదర్శక పద్ధతిలో పథకాన్ని లబ్ధిదారులకు అందించడానికే సాంకేతిక పద్ధతులు. వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్‌ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలి. అంతేతప్ప సాంకేతిక కారణాలు చూపి ఏ పథకాన్ని కూడా నిరాకరించరాదని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 237 సర్వీసులు. 72 గంటల్లోగా అందే సర్వీసులు 115 కాగా...మిగిలిన సర్వీసులు కూడా ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై వర్గీకరణ చేయాలి. డిసెంబరులో కొత్త పెన్షన్లు ఇవ్వాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు