స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

16 Jul, 2019 14:35 IST|Sakshi

 గ్రీవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్‌లైన్లో చూసే పరిస్థితి ఉండాలి

కూకటి వేళ్లతో అవినీతిని పెకలించి వేయాలి

విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల మీద ప్రభుత్వ ముద్ర ఉండాలి

హౌజింగ్‌ కోసం రూ, 8600 కోట్లు కేటాయించాం

ఎకరాకు సెంటున్నర చొప్పున 40 మందికి ఇళ్ల స్థలాలు

పాఠశాలలు, ఆస్పత్రుల దశ దిశ మార్చాలి

జిల్లా ముఖచిత్రంపై మీ సంతకం కనిపించాలి

మీరే నా బలం, విశ్వాసం

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : గ్రీవెన్సెస్‌ పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కనుగొనే దిశగా కార్యక్రమం ఉండాలని.. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఇకపై మరింత బాగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ జులై 1 నుంచి 12 వరకూ 45,496 వినతులు వచ్చాయి. ఇందులో ఆర్థిక అంశాలకు సంబంధంలేని అంశాలపై 1904 వినతులు వచ్చాయి. వీటిలో ఏడురోజుల్లోగా పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా 1116 ఉన్నాయి. ఒక ‘స్పందన’లో వచ్చిన గ్రీవెన్సెస్‌ని వచ్చే స్పందనలోగా తీర్చకపోతే... రానురాను ఇవి పేరుకుపోతాయి వచ్చే స్పందనలోగా పరిష్కారం కావాల్సిన అంశాలు తప్పకుండా చేయాలి. మన దృష్టి, ఫోకస్‌ తగ్గతే విశ్వసనీయత దెబ్బతింటుంది. ప్రజలను సంతోష పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉండాలి’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

80 శాతం అవే సమస్యలు...
‘80 శాతం గ్రీవెన్సెస్‌ భూ సంబంధిత, సివిల్‌ సప్లై, పెన్షన్లు, పురపాలక, నగర పాలక సంస్థలకు చెందినవి, ఇళ్లకు సంబంధించినవి ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు కూడా ఉన్నాయి. ఎమ్మార్వోలు తీసుకున్న గ్రీవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్‌లైన్లో చూసే పరిస్థితి ఉండాలి. అదే సమయంలో జేసీ కూడా వీటిని సమీక్షించే సౌలభ్యం ఉండాలి. కలెక్టర్, జేసీ కూడా పక్కపక్కనే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. పై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎమ్మార్వోలు కూడా చురుగ్గా సమస్యలను పరిష్కరిస్తారు. జిల్లా స్థాయిలో వస్తున్న విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యత ఉంటుందో లేదో కలెక్టర్లు పరిశీలించాలి. వారంలో ఒకరోజు కలెక్టర్‌ ఎమ్మార్వోలతో, స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి. దీనివల్ల సిబ్బంది స్పందన కార్యక్రమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారు. పై నుంచి కింది స్థాయి వరకూ గట్టి సంకేతాన్ని పంపించినట్టు అవుతుంది. ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో నేరుగా కెమెరాల ద్వారా చూడండి. ఇక్కడ నుంచి కూడా సీఎస్‌ పర్యవేక్షిస్తారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారంపై కాస్త ఎక్కువ ఫోకస్‌ పెట్టాలి’ అని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

ఆ పరిస్థితి లేదని అనుకోవచ్చా?
‘అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పాను. ఎమ్మార్వో కార్యాలయాల్లో గానీ, పోలీస్‌స్టేషన్లలో కాని ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా నాటుకు పోయిందా? లేదా అని సీఎం జగన్‌ కలెక్టర్లను అడిగారు. ఎక్కడా కూడా అవినీతిని సహించబోమని స్పష్టంచేయాలని.. ఈ విషయంపై కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వాలని సూచించారు. కూకటి వేళ్లతో అవినీతిని పెకలించి వేయాలని..ఈ మేరకు తన స్థాయిలో తాను గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. దయచేసి అధికారులంతా అవినీతి నిర్మూలనపై దృష్టిపెట్టాలని కోరారు. లంచం లేకుండా నేను పనిచేసుకోగలిగాను అని ప్రజలు అనుకోవాలని, పోలీస్‌ స్టేషన్‌కు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా వెళ్లామనే భావన ఉండేలా పని చేయాలని సూచించారు. అదే విధంగా గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి కలెక్టర్లతో సీఎం మాట్లాడుతూ.. మూడు జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలుకారణంగా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అంశాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

అధికారులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు
‘వ్యవసాయ శాఖ నుంచి కంటెంజెన్స్‌ ప్లాన్‌ కూడా జిల్లాలకు పంపిస్తున్నారు. దాని ప్రకారం విత్తనాల లభ్యత ఉండేలా చూసుకోవాలి. విత్తన సేకరణలో ఇప్పటికే తప్పులు జరిగాయి. దీంట్లో అధికారులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం 45 రోజులే అయ్యింది. డిపార్ట్‌మెంట్‌ అడిగినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం.కచ్చితంగా అధికారులు, ప్రభుత్వం కలిసి ముందు సాగాలి. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకొస్తున్నాం. రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనేటప్పుడు కొనే వస్తువు నాణ్యమైందా లేదా రైతుకు తెలియడంలేదు. మార్కెట్లో ఏది అందుబాటులో ఉంటే... అది కొంటున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అరికట్టాలి.

ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్స్‌ పెట్టాలని నిర్ణయించాం. దీనికోసం బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశాం. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల నివారణకు ఈ ల్యాబ్స్‌ కృషిచేస్తాయి. ఇదొక ప్రధాన అంశం. దీని మీద కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. కల్తీలేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ప్రతి గ్రామానికి అందాలి. అమ్మే విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల మీద ప్రభుత్వ ముద్ర ఉండాలి. గ్రామ సచివాలయాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించే కంపెనీలకు అమ్మే అవకాశం ఉండేలా చూస్తాం. ఈలోగా మీమీ జిల్లాల పరిధుల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు చేయాలి, నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి. క్వాలిటీ లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాల్లో కనిపించకూడదు. నకిలీవి ఉంటే వెంటనే గుర్తించి తొలగించాలి.ఈ ఏడాది అజెండా కింద ల్యాబ్స్‌ తీసుకురావాలి. గ్రామస్థాయిలో నాణ్యమైన వాటిని అమ్మే దుకాణాలు ఉండాలి అని సీఎం జగన్‌ వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని కలెక్టర్లు ముందుకు సాగాలని సూచించారు.

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు స్థలం
హౌజింగ్‌ కోసం రూ, 8600 కోట్లు కేటాయించామన్న సీఎం జగన్‌.... ‘ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలి. కలెక్టర్లు దృష్టి పెట్టకపోతే ఇది సాధ్యం కాదు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి.  ఎంత మందికి ఇళ్లులేవో వీరిద్వారా లెక్కలు అందుతాయి. ప్రభుత్వ భూమి లేకపోతే భూమిని కొనుగోలు చేయాలి. ప్రతి ఎకరాలో రోడ్లు మౌలిక సదుపాయాలు పోను ఎకరాకు సెంటున్నర చొప్పున 40 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎంత భూమి అవసరమవుతుందో గుర్తించండి. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తికావాలి. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారునికి తెలియని పరిస్థితి ఉండకూడదు. హౌసింగ్‌ కోసం రూ. 8,600 కోట్లు పెట్టాం. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇస్తున్నాం. కలెక్టర్ల మీదే నా విశ్వాసం. నా బలం కూడా మీరే. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే.. ఈ కార్యక్రమం కచ్చితంగా విజయవంతమవుతుంది. వచ్చే తరాలు కూడా మీ గురించి జిల్లాల్లో మాట్లాడుకుంటాయి. ఇవ్వాళ్టి నుంచే మీరు పని చేయడం మొదలుపెడితే గానీ ఉగాది నాటికి పూర్తి చేయలేరు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోండి. లబ్దిదారుల జాబితాను గ్రామ సెక్రటేరియట్‌లో పెట్టండి’ అని కలెక్టర్లకు విఙ్ఞప్తి చేశారు.

డబ్బులు ఇవ్వకుండా మంచి భోజనం అంటే ఎలా?
‘స్కూలు, ఆస్పత్రుల దశ దిశ మార్చాలి. కలెక్టర్లకు మంచి పేరు రావాలి. జిల్లా ముఖ చిత్రం మీద కలెక్టర్‌ సంతకం కనిపించాలి. మీరు అందరూ చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉంది. అన్ని జిల్లాల్లో ఉన్న స్కూళ్లు, హాస్టళ్ల మెరుగుదల కోసం చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటి ఫొటో, అప్పటి ఫొటోలు తీసి ప్రజలకు చూపించే పరిస్థితి ఉండాలి. స్కూళ్లలో కనీస సదుపాయాలు ఉన్నాయో, లేదో గుర్తించాలి. బాత్‌ రూమ్స్, తాగునీరు, కాంపౌండ్‌ వాల్‌,  ఫర్నిచర్, బ్లాక్‌ బోర్డ్స్, ఫ్యాన్స్, పెయింటింగ్‌ అండ్‌ ఫినిషింగ్‌ ప్రాధాన్యతా క్రమంలో చేయాలి. ప్లే గ్రౌండ్స్‌కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రతి స్కూల్లోనూ ఈ కనీస సదుపాయాలు ఉండాలి. ఈ ఏడాది మనం పాఠ్య ప్రణాళికను మారుస్తున్నాం. దీనిమీద నిపుణుల కమిటీ పనిచేస్తోంది. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేద్దాం. మధ్యాహ్నం భోజనం చాలా క్వాలిటీతో ఉండాలి.ఆయాలకు, సరుకులకు సరైన సమయంలో డబ్బులు ఇస్తున్నామా? లేదో చూడాలి. ఆలస్యమైతే వెంటనే నన్ను అప్రమత్తం చేయండి. 6- 8 నెలలు వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని పిల్లలకు మంచి భోజనం పెట్టమని ఎలా అడగగలం? పేదవాళ్లు ప్రభుత్వ స్కూళ్లకు కూడా వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. యూనిఫారమ్స్, పుస్తకాలు కూడా సరైన సమయానికి ఇవ్వాలి. పేరెంట్స్‌కు బట్ట ఇచ్చి, స్టిచ్చింగ్‌ ఛార్జీస్‌ ఇవ్వాలి. ఏ టైంలో ఏం చేయాలో అది కచ్చితంగా చేయాలి. జూన్‌ మొదటివారం నాటికి ఇవన్నీ అందాలి. ఆస్పత్రులమీద కూడా ఇదే తరహా దృష్టి పెట్టాలి’ అని సీఎం జగన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు