కష్టకాలంలో ‘పవర్‌’ రికార్డ్‌

29 Apr, 2020 04:38 IST|Sakshi

ప్రణాళికతో ముందడుగు.. చౌక విద్యుత్‌కే పెద్దపీట

ఏప్రిల్‌లో రూ.132 కోట్ల ఆదా

నేడు విద్యుత్‌ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్లలో ఏపీ విద్యుత్‌ సంస్థలు మరో రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్‌ కొనుగోలు చేసి రూ.132 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాయి. నిర్ధేశిత లక్ష్యం సాధించిన ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి అభినందించారు. విద్యుత్‌ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం...

లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే చౌక విద్యుత్‌ కొనుగోళ్లపై ఇంధన శాఖ దృష్టి పెట్టింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం తగ్గిన నేపథ్యంలో విద్యుత్‌ కొనుగోలులో కొంతైనా ఆదా చేయాలని భావించగా.. దీనికోసం ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
► మార్కెట్‌ పరిస్థితుల్ని అంచనా వేస్తూ అధికారులు పీపీఏలున్న విద్యుత్, మార్కెట్లో లభించే విద్యుత్‌ ధరలను పోల్చుకుంటూ.. ఏది తక్కువగా ఉంటే దాన్నే కొనుగోలు చేశారు. 
► ఏప్రిల్‌లో 824.88 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేశారు. ముందెన్నడూ లేనివిధంగా యూనిట్‌కు రూ.2.16 నుంచి రూ.2.66 మాత్రమే చెల్లించారు. ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన ధర కంటే రూ.1.60 (యూనిట్‌కు) తక్కువకే కొన్నారు. దీనివల్ల ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.132 కోట్లు ఆదా చేయగలిగారు.
► చౌక విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేశారు. దీంతో థర్మల్‌ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. 

నేడు సీఎం సమీక్ష 
సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విద్యుత్‌ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కోసం చేపడుతున్న 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించే వీలుంది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు తగ్గిపోవడం.. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ డిమాండ్‌ పడిపోవడం తదితర పరిణామాలపై సీఎం ఆరా తీసే వీలుంది. 

ఇదే కృషి కొనసాగాలి
కష్టకాలంలో రూ.132 కోట్ల ప్రజాధనం ఆదా చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి ఇదే రకమైన కృషి జరగాలి. 
– బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

మరిన్ని వార్తలు