పొగాకు రైతుల సమస్యలపై సీఎం జగన్‌ సమీక్ష 

18 Jun, 2020 15:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పొగాకు రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులను ఆదుకునేందుకు మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోనుంది. దీని కోసం రెండు,మూడు రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో సంస్థ పనిచేయనుంది. పొగాకు కనీస ధరలను ప్రభుత్వం ప్రకటించనుంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే వేలం నిర్వహించనున్నారు. (‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం)

పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటు వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం తెలిపారు. వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలని సీఎం సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరపాలని, లేదంటే వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. (అర్హులందరికీ ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’)

మరిన్ని వార్తలు