విశాఖకు కొత్త దశ, దిశ

4 Dec, 2019 04:10 IST|Sakshi
విశాఖ నగర అభివృద్ధిపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

నగర సమగ్ర అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

రవాణా, తాగు నీరు, పర్యాటక ప్రాజెక్టులపై సూచనలు 

రోడ్లు అన్నింటినీ బాగు చేయాలి 

పోలవరం నుంచి నిరంతర నీటి సరఫరా

ఇజ్రాయెల్‌ దేశంలో మొత్తం అన్నింటికీ డీశాలినేషన్‌ నీటి (ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చి)నే వాడుతున్నారు. పరిశ్రమలకు ఫ్రెష్‌ వాటర్‌ కాకుండా డీశాలినేషన్‌ నీటిని వాడే ఆలోచన చేయాలి. ఇందుకు వెయ్యి లీటర్లకు 57 సెంట్స్‌ అంటే లీటర్‌ నీటికి 4 పైసలు ఖర్చు అవుతుంది. ఇలా శుద్ధి పరిచిన నీటినే పరిశ్రమలకు కేటాయించాలి. ఇలాంటి ప్లాంట్లను అవసరం మేరకు ఏర్పాటు చేయాలి.  

మనం ఏం చేసినా చరిత్ర గుర్తుంచు కోవాలి. ఇవాళ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వచ్చే తరాలు మెచ్చుకునే రీతిలో పనులు ఉండాలి. మంచి నిర్మాణ శైలిని ఎంపిక చేసుకోవాలి. ముంబై మెట్రో నిర్మాణంలో పిల్లర్‌ డిజైన్‌ను పరిశీలించి, మెట్రో రైల్‌ కోచ్‌ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలు పాటించాలి. ప్రతి స్టేషన్‌ వద్ద, ప్రధాన జంక్షన్ల వద్ద పార్కింగ్‌ స్థలాలు ఉండేలా చూడాలి. 
- సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రవాణా, తాగు నీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి సారించి విశాఖపట్నం నగర రూపురేఖలు మార్చేందుకు సత్వరమే ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. విశాఖ నగర సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం నుంచి నగరానికి నిరంతర నీటి సరఫరాపై సమావేశంలో చర్చించారు. పోలవరం వద్దే నీటిని ఫిల్టర్‌ చేసి అక్కడి నుంచి విశాఖకు తరలించాలని, వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా నగర అవసరాలకు సరిపడా తాగు నీరు సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు సైతం తాగునీటి వసతి కల్పిస్తూ, పరిశ్రమల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. విశాఖ భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా తాగునీటి సరఫరా ప్రతిపాదనలు ఉండాలని సీఎం సూచించారు.  

వ్యర్థాలను శుద్ధి చేద్దాం.. 
కొన్నేళ్లుగా డంపింగ్‌ చేసిన వ్యర్థాల వల్ల కాలుష్యం ఏర్పడకుండా, భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియ (చెత్తను శుద్ధి చేయడం) ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అక్కడున్న డంపింగ్‌ యార్డులో క్రమేణా బయో మైనింగ్‌ చేయడం ద్వారా కాలుష్యం  ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విశాఖపట్టణంలో అన్ని రహదారులను బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇందుకు సంబంధించి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీచ్‌ రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం ఏర్పాటుపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. నిర్మాణ శైలిలో మార్పులను సూచించారు. సబ్‌ మెరైన్‌ మ్యూజియం, ఫుడ్‌ కోర్టుల ఏర్పాట్ల గురించి అధికారులు సీఎంకు వివరించారు. కైలాసగిరిలో ప్లానెటోరియం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌.పి.రామకృష్ణారెడ్డి, విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన, వీఎంఆర్‌డీఏ వైస్‌ చైర్మన్‌ కోటేశ్వర్రావు పాల్గొన్నారు. 

10 విడతలు, 10 కారిడార్లతో మెట్రో రైలు మార్గం
విశాఖపట్టణం మెట్రో రైలు మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10 విడతలు, 10 కారిడార్లతో మెట్రో రైలు మొత్తం మార్గం 140.13 కిలో మీటర్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తొలి దశలో మొత్తం 46.40 కిలోమీటర్లు ఉంటుందని, స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలో మీటర్లు, గురుద్వార ృ ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ 5.26 కిలోమీటర్లు, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్‌ వరకు 6.91 కిలో మీటర్లు ఉంటుందని చెప్పారు. దీనిని 2020 ృ 2024 మధ్య పూర్తి చేయాలని ప్రతిపాదించామని వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని మెట్రో రైల్‌ మోడళ్లను వారు చూపించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.  

మరిన్ని వార్తలు