మహిళల భద్రత చట్టాలపై చర్చ జరగాలి: సీఎం జగన్‌

9 Dec, 2019 12:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కిలో ఉల్లిని రూ. 25కు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉల్లి ధరల అంశంపై సీఎం జగన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటిదాకా 36,500 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి.. రైతు బజార్లలో కేజీ కేవలం రూ.25లకు అమ్ముతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి చోట్ల నుంచి ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంత తక్కువ ధరకు ఉల్లి అందుబాటులో ఉందని వెల్లడించారు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు ధర లభించక.. పొలాల్లోనే వదిలేసిన పరిస్థితుల చూశామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం తమ హయాంలో రైతులకు మంచిరేటు లభించడంతో పాటుగా.. వినియోగదారులకు కూడా నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200
చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. వీళ్లేమో(టీడీపీ) ఇక్కడకు వచ్చి... పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు చేసే పనులకు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా అని ప్రశ్నించారు. ఉల్లి ధరలపై చర్చకు తాము సిద్ధమని.. అదే విధంగా మహిళల భద్రత మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ అన్నారు. ‘దేశంలో సంచలనాత్మకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళల భద్రతకై కొత్త చట్టాలు తీసుకు వచ్చి ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అనే అంశంపై కూడా చర్చ జరగాలి. మహిళల భద్రత కోసం కొత్త చట్టం కూడా తీసుకు రాబోతున్నాం. దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు