1 నుంచి 6 వరకు ఇంగ్లిష్‌ మీడియం

14 Nov, 2019 04:16 IST|Sakshi

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు.. కేబినెట్‌ నిర్ణయం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు

1 నుంచి 12వ తరగతి వరకూ తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరని నిబంధన

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వివరించారు. ఆ వివరాల్లోని ముఖ్యమైన అంశాలు..

ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు ఆమోద ముద్ర
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర మేధావుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 34% స్కూళ్లలో ఇంగ్లిషులోనే విద్యా బోధన జరుగుతుండగా.. మిగిలిన 66% స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్నదే సీఎం ఆలోచన. 

అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు అంగీకారం
రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల పరిధిలో అక్రమంగా వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడుతున్న దాదాపు లక్షన్నర మందికి ఊరటనిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాంటి లే అవుట్లలో ప్లాట్‌ కొని, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం తెలిపింది. అక్రమ లే అవుట్లు కావడంతో మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదని.. ఇంటి ప్లాన్‌ ఆమోదం, బ్యాంకు లోను వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2,600 అక్రమ లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు విధివిధానాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తారు.

ఇసుక అక్రమార్కులకు చెక్‌.. చట్టానికి సవరణలు
ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా.. రవాణా చేసినా.. బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా.. ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టానికి సవరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇసుక లభ్యత పెంచేందుకు ఒకపక్క చర్యలు తీసుకుంటుంటే.. కొందరు ఉద్దేశపూర్వకంగా అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడడం చేస్తున్నారని, వారిపై కఠినంగా వ్యవహరించాలని కేబినెట్‌ భేటీలో సీఎం ఆదేశించారు. ఇసుక నిల్వ చేసే, రవాణా చేసే అధికారం గనుల శాఖకు మాత్రమే ఉండగా.. ఇకపై ఇతరులు అలాంటి చర్యలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతారు. ఇసుక డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసేందుకు గురువారం నుంచి ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు. రోజుకు 2 లక్షల టన్నుల వరకు సరఫరాను పెంచి, వారం పది రోజుల్లో కొరతను పూర్తిగా అధిగమించేలా వారోత్సవాల్లో రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ శాఖ అధికారులు దృష్టి పెడతారు.

ప్రమాదకర పరిశ్రమ వ్యర్థాలకు చెక్‌
పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలతో నదీ, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 9 వేల వరకు పరిశ్రమలుండగా, రెండు వేల పరిశ్రమలు ప్రమాదకర వ్యర్థాలు విడుదల చేసే రెడ్‌ కేటగిరీలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థీకృతంగా లేదని, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాల్ని, కలుషిత జలాల్ని శుద్ధిచేసేందుకు తగిన వ్యవస్థ అవసరమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. పారిశ్రామిక వ్యర్థాలు విడుదల చేసేవారిని బాధ్యుల్ని చేయడం.. అక్రమంగా వ్యర్థాలు డిస్పోజ్‌ చేసే వారిపై గట్టి నిఘా పెట్టడం.. వాటిని తీసుకెళ్తున్న వాహనాల్ని ట్రాక్‌ చేయడం.. మరో పరిశ్రమ పేరిట డిస్పోజ్‌ చేయడాన్ని నివారించడం.. తదితర అంశాల్ని ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ పర్యవేక్షిస్తుంది.  
సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మాట్లడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

మంత్రిమండలి భేటీలోని మరికొన్ని నిర్ణయాలు
- ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ పాలసీ–2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్‌ పవర్‌ పాలసీ–2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్, సోలార్, హైబ్రిడ్‌ పవర్‌ పాలసీ–2018 పాలసీల సవరణలకు ఆమోదం 
రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం –2008 సవరణకు అంగీకారం 
ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణ, మున్సిపల్‌ లా చట్టంలో సవరణలకు గ్రీన్‌సిగ్నల్‌
రూ. 20 కోట్లకు పైగా ఆదాయముండే 8 ప్రముఖ ఆలయాలకు కొత్తగా ట్రస్టు బోర్డుల నియామకానికి మంత్రిమండలి పచ్చజెండా 

రెండు జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు 
మొక్కజొన్న క్వింటాల్‌ ధర రూ. 2,200 నుంచి రూ.1,500కి పడిపోయిన నేపథ్యంలో వెంటనే విజయనగరం, కర్నూలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి కన్నబాబు ఈ విషయాన్ని ప్రస్తావించగా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు. 

వేటకు వెళ్లి మరణిస్తే రూ.10 లక్షల పరిహారం 
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లింపునకు కేబినెట్‌ అంగీకరించింది. దీనికి వైఎస్సార్‌ మత్య్సకార భరోసాగా నామకరణం చేశారు. వైఎస్సార్‌ బీమా పథకం కింద నమోదు చేసుకున్న 18–60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి ఇది వర్తిస్తుంది. నవంబర్‌ 21న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు