ల్యాబ్స్‌ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్‌

8 Feb, 2020 13:33 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే దిశ చట్టం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని.. ముఖ్యంగా మహిళల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ యాప్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజిని సహా డీజీపీ గౌతం సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మద్యం సేవించి రాక్షసులుగా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. అయితే సినిమాల్లో చూపించినట్లుగా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. (కన్నీళ్లు తుడిచే ‘దిశ’గా..)

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు..
‘‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 7 రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి. ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా దిశ చట్టం తీసుకవచ్చాం. వ్యవస్థలో మార్పులు రావాలి. ఈ రోజు రాజమండ్రిలో దిశ తొలి మహిళా పోలీసు స్టేషన్‌ను ప్రారంభించాం. మహిళల కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లు. డీఎస్పీ స్థాయి నేతృత్వంలో 47 మంది సిబ్బంది పనిచేస్తారు. 13 జిల్లాల్లో ‍ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 26 కోట్లు కేటాయిస్తున్నాం. హైకోర్టు అనుమతితో త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు విడుదల చేశాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.( దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం.. దిశ చట్టంలో ప్రత్యేకతలు)

అదే ప్రభుత్వ లక్ష్యం..
‘‘ప్రతీ అడుగులోనూ అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటా. వారి పిల్లలకు మేనమామలా ఉంటా. 42 మంది లక్షల తల్లులకు అమ్మఒడి అందించాం. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు. నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. సున్నావడ్డీతో మహిళలకు రుణాలు. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌ నుంచి అవతరించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని మహిళా సాధికారికతకై సర్కారు చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్‌ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా