ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?

21 Jan, 2020 09:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఐదారు వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేసినా.. ఐదారేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించలేమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. లక్ష కోట్లు అవసరమైన అమరావతిలో చేయడానికి మనకి శక్తి సరిపోదని.. అదే సమయంలో విశాఖలో చేయకపోతే అభివృద్ధి జరగదని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతామని.. అలాంటప్పుడు మనకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు.  

అలా చేస్తే అభివృద్ధి సాధ్యమేనా..?
ఈ 8 కిలోమీటర్ల పరిధిలోని అమరావతి అభివృద్ధి చేయాలని అనుకుంటే.. రూ. లక్ష కోట్లు అవసరం ఉన్న చోట్ల మనం ఎంత ఖర్చు పెట్టగలం. అయిదేళ్లలో అయిదారు వేల కోట్ల రూపాయలు పెట్టగలుగుతాం. అయిదేళ్ల తర్వాత ఒకసారి మనమంతా ఇదే చట్టసభలో కూర్చుని రాష్ట్రంలో మన పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మన రాజధాని పరిస్థితి ఏంటి? అని చర్చిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరుతున్నా. ఒకవైపు లక్ష కోట్లు అవసరమైన చోట్ల డబ్బుల్లేక కేవలం అయిదారు వేల కోట్లు మాత్రమే పెట్టే పరిస్థితి. ఈ అయిదారు వేల కోట్లు మాత్రమే ఖర్చుపెడితే అది సముద్రంలో ఒక నీటి బొట్టులా కనిపించను కూడా కనిపించదు.

అలా చేస్తే అయిదేళ్ల తర్వాత ఎలా ఉంటామంటే  మళ్లీ ఇలాగే ఉంటాం. విశాఖపట్నం పరిస్థితి చూస్తే అక్కడేమో మనం పెట్టని పరిస్థితి. ఇక్కడ (అమరావతిలో) చేయడానికి మనకు శక్తి సరిపోదు. అక్కడ (విశాఖలో) చేయకపోతే అభివృద్ధి జరగదు. సచివాలయం కదల్చకూడదు. హైకోర్టును మార్చకూడదనుకుంటే మళ్లీ అయిదేళ్ల తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాల్సి వస్తుంది. విశాఖలో చేయాలంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని వెనుకడుగు వేస్తే అయిదేళ్ల తర్వాత కూడా మన పిల్లలు ఉద్యోగాల కోసం  బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. రాజధాని ఎక్కడంటే మళ్లీ ఇక్కడే ఈ గ్రామాల మధ్య కూర్చుని ఇదే మన రాజధాని అనుకోవాల్సిందే.  

మేనిఫెస్టోలో బీజేపీ ఏం చెప్పిందో చూడండి 
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మోదీ వచ్చారు, అది చెప్పారు.. ఇది చెప్పారు అని మోదీ మీద కూడా అభాండాలు వేసేశారు. ఒకసారి ఇదే బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టో చూద్దాం...ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీజేపీ మ్యానిఫెస్టోలో మోదీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఏపీ హైకోర్టును శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది. ‘అమరావతి నిర్మాణం ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లా సాగుతోంది. ఏడాదికి మూడు పంటలు పండే విలువైన వ్యవసాయ భూముల్ని టీడీపీ ప్రభుత్వం తీసుకుంది.

బీజేపీ అధికారంలోకి రాగానే తమ భూములు కావాలని అడిగే రైతులకు వారి భూములు వెనక్కి ఇచ్చేస్తుంది. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం’ అని సాక్షాత్తూ బీజేపీ వాళ్లు 2019 మ్యానిఫెస్టోలో చెప్పినదాన్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో వారికే తెలియాలి.  ఇలాంటి వాళ్లను తన్ని పార్టీ నుంచి బయటకు పంపించమని నేను బీజేపీ వాళ్లను కోరుతున్నా.  

2021, జూన్‌కు పోలవరం పూర్తి చేస్తాం 
పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు రకరకాలుగా వక్రీకరిస్తూ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి నేను ఒక్క మాట చెబుతా. పోలవరం ప్రాజెక్టును రివర్స్‌ టెండరింగ్‌ చేశాం. దాదాపు రూ.830 కోట్లు ఆదా చేశాం. ఆదా చేయడమే కాకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాం. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు 2021, జూన్‌ నాటికి పూర్తి చేస్తాం. నీళ్లు ఇస్తామని కూడా కచ్చితంగా చెబుతున్నా. ప్రాజెక్టు మంచి స్పీడ్‌లో జరుగుతోంది.

చదవండి: 
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం

సంక్షేమ పథకాలు వదిలేద్దామా!

ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా?


 

>
మరిన్ని వార్తలు