ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుకు ఆమోదం

23 Jan, 2020 13:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని గుర్తు చేశారు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ) బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను సభలో వివరించారు.(ప్రతీ పిల్లాడికి ఒక కిట్‌: సీఎం జగన్‌)

‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్‌ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకువస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీషులో చదువుకుంటే.. పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది. కంప్యూటర్‌ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్‌ టు ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గత సమావేశాల్లో బిల్లు తీసుకువస్తే టీడీపీ మండలిలో అడ్డుకుంది. పేదవాడికి మంచి జరుగుతుంటే ఆలస్యం చేయాలని వారు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడినా పేద పిల్లలకు జగన్‌ మామ తోడుగా ఉంటాడు. మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్‌లో విద్యా కానుక కిట్‌ అందిస్తాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాగా పేద విద్యార్థులకు మేలు చేకూర్చే విధంగా రూపొందించిన ఈ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే శాసనమండలి ఈ బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి అసెంబ్లీకి పంపగా.. వాటిని తిరస్కరిస్తూ శాసన సభ ఈరోజు ఆమోదించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా