‘బెల్ట్‌’ తీయకుంటే లైసెన్స్‌ రద్దు

2 Jun, 2019 03:45 IST|Sakshi

అవసరమైతే మద్యం షాపులపై కొత్త విధానం.. ఎక్సైజ్‌ శాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

పాదయాత్ర హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

మద్యం విక్రయించే బెల్టు షాపులను సమూలంగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశం

ప్రతి పేద కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరియాలి

మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడొద్దు

నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచన

సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చిచ్చు రగిలించి మహిళలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్న మద్యం బెల్టు షాపులను నిషేధిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తన పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన మూడో రోజే ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు
పేదల జీవితాలను దారుణంగా నాశనం చేస్తున్న బెల్ట్‌ షాపులను ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే సమూలంగా తొలగించాల్సిందేనని శనివారం ఎక్సైజ్‌ శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. దీనిద్వారా ప్రతి పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఎక్సైజ్‌ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మద్యాన్ని కేవలం ప్రత్యేక ఆదాయ వనరుగా చూడకూడదని పేర్కొన్నారు. ఎక్కడైనా బెల్ట్‌ షాప్‌లు కనిపిస్తే వాటిపై చర్యలు తీసుకుంటూనే వాటికి మద్యం సరఫరా చేసిన వైన్‌ షాప్‌ల లైసెన్స్‌లు కూడా రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించి బెల్ట్‌ షాప్‌లను సమూలంగా నిర్మూలించడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. దశలవారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జగన్‌
ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో మహిళలు పెద్ద ఎత్తున వైఎస్‌ జగన్‌ను కలుసుకుని మద్యం మహమ్మారి వల్ల తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని మొర పెట్టుకున్నారు. మద్యం లేకుండా చేయాలని, ముఖ్యంగా వీధి వీధిన వెలసిన బెల్ట్‌ షాపుల వల్ల తమ భర్తలు, చేతికి అందివచ్చిన కుమారులు మద్యానికి బానిసలై చిన్న వయసులోనే మృతి చెందుతున్నారని ఆక్రోశించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాంతాల నుంచి జగన్‌కు ఇలాంటి వినతులే అందాయి. మన ప్రభుత్వం రాగానే మద్యం మహమ్మారిని దశలవారీగా పారదోలుదామని, అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి బెల్ట్‌ షాపులను రద్దు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో 4,380 వైన్‌ షాపులుండగా, వీటికి అనుంబంధంగా ఒక్కో షాపునకు 10 చొప్పున 43,800 బెల్ట్‌ షాపులున్నాయి. 800 బార్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు