గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్‌ ఆరా

3 Aug, 2019 19:28 IST|Sakshi
(ఫైల్‌)

సాక్షి, అమరావతి : గోదావరి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తు‍త పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు.  సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు.  అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. సీఎం జగన్‌ ముంపు గ్రామాల్లో  చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరిన్ని వార్తలు