ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

15 Feb, 2020 19:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సీఎం.. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లా‍రు. రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని ఆయనకి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. దీని కోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయశాఖమంత్రికి వివరించారు.  చదవండి: న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్‌

ఇందుకోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం– 2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం వివరించారు. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. శాసనమండలి రద్దు అంశాన్నికూడా కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. దీనికి సంబంధించి తదనంతర చర్యలు తీసుకోవాలని కోరారు.

శాసనమండలి.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ నేపధ్యంలో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.. శాసనసభ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిందని అందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్నికూడా సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. చట్టం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రమంత్రికి వివరించారు.

చదవండి: దిశ చట్టం రూపుదాల్చాలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా