దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్‌

4 Oct, 2019 14:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌(సీపీ) ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం భద్రతా కారణాల దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. సీఎం దర్శనానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంతేగాక భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి కోసం 3 క్యూలైన్లు పూర్తి స్థాయిలో యథావిధిగా కొనసాగుతాయని సీపీ తెలిపారు. ఈ రోజు శుక్రవారం కావటంతో ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరిగిందనీ, పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయని చెప్పారు. కాగా దేవస్థానంలో విధులు నిర్వహించే వారి వాహనాలకు సైతం కిందే పార్కింగ్‌ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. 

వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం
ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు అనగా 5వ తేదీ శనివారం అమ్మవారు శ్రీసరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే దర్శనాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నామని సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అదేవిధంగా రేపు భక్తులకు సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ ఏరియాగా ఏర్పాటు చేసి, వారు వేచి చూసే అవకాశం కల్పించి తర్వాత క్యూలైన్లలో వదలనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ అందిస్తున్నామని తెలిపారు. అంతేగాక అంతరాలయ దర్శనం ఉండబోదని ఈ మేరకు సీపీ స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వారికి ఎటువంటి టిక్కెట్‌ రుసుము అవసరం లేకుండా, పూర్తి ఉచిత దర్శనం  కల్పిస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు