-

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌

26 Mar, 2020 12:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. కాగా కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.(కరోనా అలర్ట్‌ : ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి)

సీఎం సహాయ నిధికి ఉద్యోగ సంఘాల విరాళం
కోవిడ్-19 సహాయక చర్యలకై ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతం విరాళం ప్రకటించాయి. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వై.వి.రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు. 

ఉద్యోగ సంఘాల ద్వారా ఒకరోజు జీతం విరాళంగా ప్రకటించడం ద్వారా దాదాపు రూ. 100 కోట్లు సమకూరుతాయని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. కోవిడ్‌ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని ప్రశంసించారు. ముందు చూపుతో సీఎం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ముందుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు బాగున్నాయని.. ఈ పరిస్థితుల్లో అండగా ఉండేందుకు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు