గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానానికి శ్రీకారం

19 Oct, 2019 04:58 IST|Sakshi

పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తి తీర్చి రాష్ట్రాన్ని కరువనేది ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానానికి డిసెంబర్‌ 26వ తేదీన సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆలోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంచనాలు (ఎస్టిమేట్లు) రూపొందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నదుల అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు.

గోదావరి–పెన్నా అనుసంధానంపై వ్యాప్కోస్‌ నివేదికను తుంగలో తొక్కిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు  కమీషన్ల కోసం చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టుకు అందించాల్సిన నీటినే నాగార్జునసాగర్‌ కుడి కాలువకు తరలించే పనులను ‘గోదావరి–పెన్నా’ అనుసంధానం తొలిదశ కింద రూ.6,020 కోట్లతో చేపట్టింది. పర్యావరణ, హైడ్రలాజికల్‌ తదితర అనుమతులు లేకుండా చేపట్టిన ఈ పనులను రద్దు చేయాలని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. గోదావరి వరద జలాలను రోజుకు కనీసం నాలుగు టీఎంసీల చొప్పున కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం పనులను చేపట్టాలని జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

సమగ్ర డీపీఆర్‌పై కసరత్తు.. 
గత సర్కారు హయాంలో రూ.8.59 కోట్లతో తయారు చేసిన డీపీఆర్‌ అసమగ్రంగా ఉన్నందున గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానంపై తాజా ప్రతిపాదనల మేరకు గతంలో చెల్లించిన బిల్లులతోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేయాలని వ్యాప్కోస్‌ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి డీపీఆర్‌ ఇవ్వాలని నిర్దేశించారు.

దీని ఆధారంగా నవంబర్‌ 15 నాటికి పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్లు, పరిపాలన అనుమతులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వెంటనే టెండర్లు పిలిచి డిసెంబర్‌ 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నారు. డిసెంబర్‌ 26న గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

మరిన్ని వార్తలు