తెలుగు ఔన్నత్యాన్ని చాటుదాం: సీఎం జగన్‌

29 Aug, 2019 10:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈరోజు(గురువారం) తెలుగు భాషా దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు భాషాభివృద్ధికై గిడుగు రామమూర్తి చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

మహనీయుడి స్మరణలో..
గ్రాంథిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ రామమూర్తి ప్రాథమిక విద్య స్వస్థలంలోనే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. అనంతరం రామమూర్తి మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. 

భాషను అమితంగా ప్రేమించే గిడుగు రామమూర్తి అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్‌ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లిష్‌ కోశాన్ని నిర్మించారు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం ఆయనకు కైజర్‌-ఇ-హింద్‌ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు.

క్రీడాకారులకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు సాధించిన హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌.. దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అటువంటి గొప్ప క్రీడాకారుడిని స్మరించుకుంటూ నేడు ఆయన జన్మదినం సందర్భంగా క్రీడల దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు