జాగ్రత్తలతో జయిద్దాం

30 May, 2020 04:53 IST|Sakshi

కోవిడ్‌కు భయపడొద్దు.. బాధితులను అంటరానివారిగా చూడొద్దు: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19ను ఎదుర్కొ నేందుకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నా మని, ఎవరూ భయపడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. కరోనా సోకినవారిని అంటరానివారిగా చూడరాదని, అది ఎవరికైనా సోకే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిం చారు. జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే వైరస్‌ ప్రభావం తగ్గిపోతుందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య, ఆరోగ్య రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేధోమధనం సదస్సు నిర్వహించారు. కోవిడ్‌–19 నివారణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఒకటి నుంచి 13 ల్యాబ్‌లకు...
► ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేస్తూనే కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన అడుగులు వేశాం. విరామం లేకుండా సేవలందించిన వైద్య సిబ్బందిని అభినందిస్తున్నా. 
► రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఒక్క ల్యాబ్‌తో మొదలై ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున 13 ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. మరో 337 ట్రునాట్‌ యంత్రాలు సీహెచ్‌సీల్లో అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్‌ రాకముందు రోజుకు కనీసం రెండు పరీక్షలు కూడా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు రోజుకు 10 వేల నుంచి 11 వేల పరీక్షలు చేసే సామర్థ్యానికి ఎదిగాం. ఇప్పటివరకు దాదాపు 3.42 లక్షల పరీక్షలు చేశాం. 10 లక్షల జనాభాకు సగటున రాష్ట్రంలో 6,627 పరీక్షలు చేశాం. ఇది దేశంలో అత్యధికం.
► దేశం మొత్తం మీద పాజిటివ్‌ కేసుల రేటు 4.71 శాతం కాగా మన రాష్ట్రంలో 0.95 «శాతం మాత్రమే ఉంది. రికవరీ రేటు దేశంలో 42.75 శాతం ఉంటే మన రాష్ట్రంలో 65.49 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో సగటున 2.86 శాతం ఉంటే మన దగ్గర 1.82 శాతం మాత్రమే ఉంది.

సమాజాన్ని సిద్ధం చేశాం
► కరోనాపై యుద్ధంలో మనం దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేలా సమాజాన్ని సిద్ధం చేశాం. వ్యాక్సిన్‌ వచ్చే వరకు కోవిడ్‌ పోదు. దాంతో సహజీవనం చేయక తప్పదు.

పెద్దలను బాగా చూసుకుందాం...
► కోవిడ్‌ సోకితే వారిని దూరం చేయకండి. ఎందుకంటే రేపు ఎవరికైనా రావొచ్చు. 98 శాతం మంది రికవర్‌ అవుతున్నారు. కేవలం 2 శాతం మాత్రమే చనిపోతున్నారంటే అంత ప్రమాదం లేదు. 85 శాతం మంది ఇంట్లోనే వైద్యంతో బయట పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎవరికైనా రావచ్చు. ఇంట్లో పెద్దలను బాగా చూసుకోవాలి’ 

ఆసుపత్రులు, డాక్టర్లు, బెడ్స్‌ సిద్ధం 
► కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్ర స్థాయిలో 5 ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. 65 జిల్లా స్థాయి ఆస్పత్రులుఉన్నాయి. 38 వేల ఐసోలేషన్‌ పడకలు సిద్ధంగా ఉండగా, 15 వేల బెడ్లకు ఆక్సీజన్‌ సరఫరా సౌకర్యం ఉంది. 5,400 బెడ్లు ఐసీయూలో ఉండగా, 1,350 పడకలకు వెంటిలేటర్లు రెడీగా ఉన్నాయి. 24 వేల మంది డాక్టర్లు, 22,500 మంది పారా మెడికల్‌ సిబ్బంది కోవిడ్‌ చికిత్సకు సిద్ధంగా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు