సంతృప్త స్థాయిలో.. అన్ని పథకాలు

11 Jul, 2020 03:53 IST|Sakshi

అధికారులతో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎవరైనా మిగిలిపోతే అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు 

ఆ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన వారికి వర్తింప చేయాలి 

అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టీకరణ

అర్హులందరికీ ‘నేతన్న నేస్తం’  

వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది కోవిడ్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ ఆరు నెలలు ముందుగా జూన్‌ 20న అమలు చేసింది. ఈ నేపథ్యంలో అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి, దరఖాస్తు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.   

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇదివరకే చెప్పామన్నారు. వాటన్నింటినీ పరిష్కరించి, అర్హత ఉన్న వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరుపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ గత జూన్‌లో వివిధ పథకాలు అమలు చేశామని చెప్పారు. కోవిడ్‌ కష్టకాలంలో ఆదుకునేందుకు ఏడాది ముగియక ముందే, అమలు తేదీలను ముందుకు జరిపి మరీ పథకాలు అమలు చేశామన్నారు. పథకాల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోతే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. ఆ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు లబ్ధి కలిగించాలని ఆదేశించారు.   

గత నెలలో నాలుగు పథకాలు 
గత నెల 4న ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’, 24న ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వాహనమిత్ర పథకాన్ని నాలుగు నెలలు ముందుగా అమలు చేసింది.  

3 రోజుల్లో దరఖాస్తుకు అవకాశం
1 చేనేతలకు ఏడాదిగా మగ్గం ఉండాలనే నిబంధనను సీఎం ఆదేశాల మేరకు సవరించారు. కొత్తగా నేతన్నలు దరఖాస్తు చేసుకునేందుకు 3 రోజులు అవకాశం కల్పించారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 

2 రాష్ట్రంలోని అర్హులైన చేనేతలను ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోని వలంటీర్లు వెంటనే గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అర్హుల వివరాలు 3 రోజుల్లోపు చేనేత, జౌళి శాఖ లాగిన్‌కు పంపాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు