ఆందోళన వద్దు.. అప్రమత్తం కావాలి

7 Mar, 2020 03:30 IST|Sakshi
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

కోవిడ్‌ వైరస్‌పై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వెంటనే వైద్య సదుపాయం అందించాలి

గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి 

విజయవాడ, అనంతపురంలో ప్రత్యేక వార్డుల కోసం రూ.60 కోట్లు

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌)పై ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు సూచించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి అనుమానిత కేసులుంటే వెంటనే నమోదు చేసి వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదో అవగాహన కల్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని సీఎం ఆదేశించారు. విజయవాడ, అనంతపురంలో కరోనా వైరస్‌ చికిత్సకు ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లతోపాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం పేర్కొన్నారు.  

రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు 
- రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా వైరస్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు  
- 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్‌ వచ్చాయి. 
- మిగతావి కూడా అనుమానిత కేసులే. 
- వ్యక్తిగత శుభ్రత, జాగ్రత్తలతో కరోనా వైరస్‌ బారిన పడకుండా చాలావరకు నివారించవచ్చు. 
- పాజిటివ్‌గా నమోదైన కేసుల్లో కేవలం 5 శాతం మందే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 
- ఇతర వ్యాధులతో సతమతం అవుతున్న వారికి కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారుతుంది. 
- విదేశాల నుంచి వచ్చిన 6,927 మందికి విశాఖ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌. 
- కరోనా బాధితుల కోసం ముందస్తుగా 351 పడకలు, 47 వెంటిలేటర్లు, 1.10 లక్షల మాస్కులు, 12,444 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లు సిద్ధం 
- మరో 12 వేల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వెప్‌మెంట్లు కొత్తగా కొనుగోలు, 50 వేల మాస్కులు అందుబాటులో. 
- ప్రధాన ఆస్పత్రికి దూరంగా అన్ని సదుపాయాలతో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు. 
- కరోనా బాధితుల కోసం విజయవాడ, అనంతపురంలో  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు సిద్ధం. 
- కరోనా వైరస్‌ అనుమానితులను ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు. 
- రోగిని తరలించిన వెంటనే అంబులెన్స్‌ పూర్తిగా స్టెరిలైజ్‌. 
- ఎక్కడైనా పాజిటివ్‌ కేసు నమోదైతే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ. 
- విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలి.  

>
మరిన్ని వార్తలు