35 మంది ఏపీ యువతను చైనా నుంచి రప్పించండి

1 Feb, 2020 03:38 IST|Sakshi

ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి: శిక్షణ కోసం చైనా వెళ్లిన 35 మంది విశాఖపట్నంకు చెందిన యువతను రాష్ట్రానికి రప్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం సీఎం ఈ లేఖ రాశారు. చైనా లోని ప్యానల్‌ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఓపీటీఎల్‌) 2019లో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో వీరు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

ప్రస్తుతం వీరు వైరస్‌ వ్యాపించిన వూహాన్‌లోనే ఉండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందువల్ల వీరిని త్వరితగతిన ఇక్కడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఈ మేరకు చైనాలోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీరు తిరుపతి సమీపంలోని ఎల్‌సీడీ టీవీ స్క్రీన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో పని చేస్తూ చైనా కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ కావడంతో మరికొంత మందితో కలిసి అక్కడికి వెళ్లారు. మార్చి మొదటి వారంలో తిరిగి రావాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు