బెస్ట్‌ సీఎం వైఎస్‌ జగన్‌

3 Jun, 2020 03:16 IST|Sakshi

ప్రజాదరణలో సీనియర్ల సరసన నిలిచిన ముఖ్యమంత్రి జగన్‌

దేశవ్యాప్తంగా టాప్‌ –5 సీఎంల జాబితాలో చోటు

ప్రధాని మోదీ పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి

‘సీఓటర్‌ – ఐఏఎన్‌ఎస్‌’ సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి జనరంజకంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచారు. మరోవైపు వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం) ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 83.6 శాతం సంతృప్తి వ్యక్తమైంది.

నవీన్‌ పట్నాయక్‌కు ప్రథమ స్థానం.. 
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ప్రథమ స్థానం దక్కింది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌    మిగతా  రెండో స్థానంలోనూ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మూడో స్థానంలోనూ నిలిచారు. ‘సీ ఓటర్‌–ఐఏఎన్‌ఎస్‌’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా డాట్‌కామ్‌’ మంగళవారం ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాలు పొందిన వారిలో ఇద్దరు తలలు పండిన సీనియర్లే కావడం విశేషం. యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి సరసన నిలవడం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 

సీఎంలకు ప్రజాదరణ ఇలా...
– నవీన్‌ పట్నాయక్‌ పాలనపై 82.96 శాతం మంది ఒడిషా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 
– భూపేష్‌ భగేల్‌ పాలనపై 81.06 శాతం మంది ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు, పినరయ్‌ పాలనపై కేరళలో 80.28 శాతం సంతృప్తి వ్యక్తమైంది. 
– ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 
– 72.56 శాతం మంది ప్రజల మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఐదో స్థానంలోనూ, 74.18  శాతం మంది మద్దతుతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 6వ స్థానంలోనూ నిలిచారు. 
– 54.26 శాతం మంది ప్రజల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 16వ స్థానంలో నిలిచారు. 
– కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యూడ్యూరప్ప 67.21 శాతం మంది మద్దతుతో 8వ స్థానంలోనూ, 41.28 శాతం ప్రజాదరణతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 19వ స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.

ప్రధాని మోదీకి 65.69 శాతం ప్రజల మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి చెందినట్లు
‘సీ ఓటర్‌– ఐఏఎన్‌ఎస్‌’ సర్వే తెలిపింది. ప్రధాని మోదీ పట్ల ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల ప్రజలు అత్యంత సంతృప్తి ప్రకటించారు. 

ప్రధానికి ఒడిశాలో అత్యంత ప్రజాదరణ 
– ప్రధాని మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 58.36 శాతం మంది ప్రజలు అత్యంత సంతృప్తి కనబరచగా, 24.04 శాతం సంతృప్తి కనబరచారు. 16.71 శాతం సంతృప్తి చెందలేదని సర్వే తేల్చింది. స్థూలంగా 65.69 శాతం మంది ప్రధాని పట్ల సంతృప్తిని ప్రకటించారు. 
– ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తంచేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (93.95 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (92.73 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (83.6 శాతం), జార్ఖండ్‌ (82.87 శాతం), కర్ణాటక (82.56 శాతం), గుజరాత్‌ (76.42 శాతం), అసోం (74.59 శాతం), తెలంగాణ (71.51 శాతం), మహారాష్ట్ర (71.48 శాతం) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచాయి. దక్షిణాదిన తమిళనాడు(32.89 శాతం), కేరళ (32.15 శాతం) రాష్ట్రాల్లో ప్రధాని పట్ల అతి తక్కువగా సంతృప్తి కనబరిచారు. 

కేంద్రంపై 62 శాతం మంది సంతృప్తి
– కేంద్ర ప్రభుత్వం పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, అసోం, ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. అత్యంత తక్కువగా సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా, హర్యానా, కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్‌ ఉన్నాయి. మొత్తంగా 62 శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పనితీరు పట్ల  తమిళనాడు, కేరళ, అసోం, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో సంతృప్తి మెరుగ్గా ఉంది.

మరిన్ని వార్తలు