రైతుకు గిట్టుబాటు ధర

2 Apr, 2020 03:30 IST|Sakshi

వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధరలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

ఎంపెడా ప్రకటించిన ధరలు ఆక్వా రైతులకు లభించాల్సిందే

లేదంటే ఆ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను స్వాధీనం చేసుకోవచ్చు

సాక్షి, అమరావతి: రైతుల ఉత్పత్తులకు కనీన గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఆక్వా పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర రావాల్సిందేనని పేర్కొన్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గిట్టుబాటు ధర అంశం చాలా ముఖ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 

ప్రత్యేక అధికారాలను వాడండి..
► ఆక్వా ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. ఎంపెడా ప్రకటించిన ధర రైతులకు లభించాలి. కలెక్టర్లందరికీ చెబుతున్నాం. ప్రాసెసింగ్‌ యూనిట్లకు కూలీలు రాలేని పరిస్థితి ఉంటే వెంటనే దృష్టి సారించాలి. సమస్యలు పరిష్కరించాలి. అవసరమైతే జేసీని, ఆర్డీఓని పంపించి వారికి ఇబ్బంది లేకుండా చూడాలి. 
► ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వాళ్లు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించి దోపిడీకి ప్రయత్నిస్తే సహించేది లేదు. చెప్పిన రేటు ఇవ్వకపోతే ప్రత్యేక అధికారాలను వాడండి. అవసరమైతే ఆ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడద్దు.
► రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే ప్రాసెసింగ్‌ చేయాలి. తర్వాత మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలి. ప్రాసెసింగ్‌ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. నేరుగా ఎక్స్‌పోర్ట్‌ మార్కెటింగ్‌ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలి.
► ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో వ్యవసాయం, ఆక్వాపై సమీక్ష నిర్వహించాలి. మంత్రులు మంత్రి కన్నబాబు, మోపిదేవి అందుబాటులో ఉంటారు.
► రైతు తన పంటను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స, మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు