ప్రతీ జిల్లాలో ల్యాబ్‌ను ఏర్పాటు చేయండి

26 Apr, 2020 02:26 IST|Sakshi

ల్యాబ్‌లు లేని జిల్లాల్లో వెంటనే ఏర్పాటు చేయండి

కోవిడ్‌–19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌

శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగు చూసినందున ఒక మంచి అధికారిని అక్కడ పెట్టాలని సీఎం ఆదేశం

ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను వెంటనే కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలి

శాశ్వత ప్రాతిపదికన టెలి మెడిసిన్‌

మున్ముందు విలేజ్‌ క్లినిక్‌ల కీలక పాత్ర

మొత్తంగా 61,266 పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడి.. 

శుక్రవారం ఒక్కరోజే 6,928 టెస్ట్‌లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్‌ను నిర్ధారించే ల్యాబ్‌లు ఉండాలని, లేని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగు చూసినందున ఆ జిల్లాకు ఒక మంచి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సీఎం చెప్పారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, పరీక్షల సరళిపై శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు.. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

మౌలిక సదుపాయాలు మెరుగు పడాలి
– కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడం చాలా అవసరం. ఇందులో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి.
– ఇది వరకే నిర్ణయించిన విధంగా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చే ప్రక్రియ వేగవంతం కావాలి. 
– కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ అనుమతించిన ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడ పని చేస్తున్న వారికి అవగాహన కలిగించాలి.
కోవిడ్‌ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్‌   

లోపాలు లేకుండా చర్యలు
– జనతా బజార్ల ఆలోచనకు మంచి మద్దతు లభిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్యక్రమాలు, కోవిడ్‌–19 నివారణా చర్యలపై ప్రజల స్పందన తెలుసుకున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
– నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 6,928 పరీక్షలు చేయించామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో  ఇప్పటి వరకు 61,266 పరీక్షలు చేశామని చెప్పారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,147 పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని వివరించారు. 
– ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం అళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
టెలి మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలి. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా మందులు కూడా పంపించాలి. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. టెలి మెడిసిన్‌ నంబర్‌ 14410కు మరింత ప్రచారం కల్పించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

>
మరిన్ని వార్తలు