సర్వజనాస్పత్రికి జీవం పోసిన వైఎస్‌ జగన్‌

19 Jul, 2019 09:29 IST|Sakshi
అదనపు భవనం స్థల పరిశీలన కోసం ఆర్‌ఎంఓ, ఇతర వైద్యులతో సమావేశమైన సూపరింటెండెంట్‌ బాబూలాల్‌   

రూ.250 కోట్లతో ఆస్పత్రిలో అదనపు భవన నిర్మాణం 

అందుబాటులోకి మరో 700 పడకలు 

ట్రామాకేర్‌కు మరో రూ.5 కోట్లు 

‘సూపర్‌ స్పెషాలిటీ’కి బడ్జెట్‌లో రూ.30 కోట్లు  

చిన్నపిల్లల వార్డుకు రూ.45 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్‌  

వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌  

ప్రభుత్వ సర్వజనాస్పత్రికి మహర్దశ చేకూరనుంది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌... ఆస్పత్రి రూపురేఖలు మార్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. రూ.250 కోట్లతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే బడ్జెట్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు కేటాయించగా.. తాజాగా చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్‌ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఇక నుంచి ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన బాధలు తప్పడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. 

సాక్షి, అనంతపురం న్యూసిటీ : జిల్లాకే పెద్దదిక్కు అనంతపురంలోని సర్వజనాస్పత్రి. కానీ గత పాలకుల వివక్ష కారణంగా నిధులు లేక మెరుగైన సేవలందించలేకపోతోంది. బోధనాస్పత్రి ఏర్పడి 19 ఏళ్లయినా.. కనీసం పడకలు కూడా అందుబాటులో లేక జనం సతమతమయ్యారు. ఇవన్నీ గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వంలోకి వచ్చిన అనతి కాలంలోనే సర్వజనాస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో ఈ ఏడాది చోటు చేసుకున్న శిశు మరణాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయన ఆదేశాలతో జూన్‌ 15న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని సర్వజనాస్పత్రిని పరిశీలించి, మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. వాటన్నింటినీ ముఖ్యమంత్రికి అందజేయగా.. వెంటనే స్పందిస్తూ అదనపు పడకలు ఏర్పాటు చేయాలని భావించారు.

అందులో భాగంగానే  రూ.250 కోట్లతో 700 పడకలు ఏర్పాటు చేసేందుకు నూతన భవనం మంజూరు చేశారు. ఈ క్రమంలోనే నూతన నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ బాబ్జి రెండు రోజుల క్రితం ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా వివిధ వార్డులు, బ్లాక్‌లు ఎక్కడ ఏర్పాటు చేయాలో నివేదికను పంపాలని డీఎంఈ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాబూలాల్‌కు ఆదేశించారు. 

ఆర్‌అండ్‌బీ కార్యాలయం అనువైంది 
ఉన్నతాధికారుల ఆదేశాలతో అదనపు భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు గురువారం సూపరింటెండెంట్‌ బాబూలాల్‌ తన చాంబర్‌లో ఆర్‌ఎంఓ డాక్టర్‌ లలిత, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్, ఏఓ డాక్టర్‌ శ్రీనివాస్‌శౌరి తదితరులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి ఆవరణలో మరో 700 పడకల భవనం నిర్మించే స్థలం లేదని తేల్చేశారు. అయితే రోగులకు ఇబ్బంది కలుగకుండా స్థలాన్ని పరిశీలించాలని భావించారు.

ఈ క్రమంలోనే బోధనాస్పత్రిలో స్థలంలో నిర్మించిన ఆర్‌అండ్‌బీ కార్యాలయమైతే బాగుటుందని అందరూ నిర్ణయించారు. అక్కడ 3 నుంచి 5 ఎకరాల స్థలం ఉంటుందని, భవనం ఏర్పాటుకు అనువైన ప్రాంతమని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్దామన్నారు. ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, తదితర విభాగాలతో పాటు ఓపీ బ్లాక్, మెడికల్‌ రికార్డ్‌ సెక్షన్, ఐసీసీయూలు, డయాగ్నస్టిక్‌ బ్లాక్‌ తదితర వాటిని నూతన భవనంలో మార్చితే రోగులకు మెరుగైన సేవలందించవచ్చని వైద్యులు భావిస్తున్నారు.  

ఇక ‘సూపర్‌’ వైద్యం 
అనంతలో వైద్య సదుపాయాలు పెంచాలని భావిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ మేరకు బడ్జెట్‌లో అనంతపురం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ ఆస్పత్రిలో 8 సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ట్రామాకేర్‌ సెంటర్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించేందుకు ట్రాక్‌కేర్‌ను మరింత బలోపేతం కానుంది. ఇక చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్‌ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా మల్టీచానల్‌ మానిటర్స్, హైఫ్లో నాసల్‌ క్యాన్యులా, ఫోర్టబుల్‌ పంప్‌ సెక్షన్స్, లారింజోస్పోప్స్, సీ పాప్స్, కంప్రెసర్లు తదితర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.    

మరిన్ని వార్తలు