ముగిసిన విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు

4 Feb, 2020 03:34 IST|Sakshi
విశాఖ శ్రీశారదాపీఠంలోని స్వర్ణ మందిరంలో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేస్తున్న పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీ. అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌

హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రాజశ్యామల అమ్మవారికి పూజలు, మహా పూర్ణాహుతి

స్పీకర్‌ తమ్మినేని, పలువురు మంత్రులు రాక 

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, మంత్రి తలసాని హాజరు 

సీఎంకు విశాఖ ప్రజల ఘనస్వాగతం..

రోడ్డుకిరువైపులా నిలిచి పూలవర్షం 

థాంక్యూ సీఎం అంటూ నినాదాలు..

సాక్షి, విశాఖపట్నం: రాజశ్యామల అమ్మవారు కొలువైన విశాఖ నగరం చినముషిడివాడలోని విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనం, లోక కల్యాణార్థం శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం ఈ కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. ఉదయం 11.25 గంటలకు శారదా పీఠానికి చేరుకున్న ఆయనకు మేళతాళాలు, పూర్ణకుంభంతో పీఠం ధర్మకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌.. స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలతోపాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. గోమాతకు పూజలు ఆచరించి నైవేద్యం సమర్పించారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం, శారదాపీఠం తలపెట్టిన రాజశ్యామల యాగం, మహా పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభించారు.

స్వరూపానందేంద్ర తన వ్యాఖ్యానంతో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు. శ్రౌత మహాసభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తంగిరాల విశ్వనాథ పౌండరీకయాజులుకు సీఎం చేతుల మీదుగా స్వర్ణ కంకణధారణ చేశారు. అహితాగ్ని భాస్కర అనే బిరుదును అంకితం చేశారు. శాస్త్ర సభలో ప్రతిభ చూపించిన లక్ష్మీప్రసన్నాంజనేయశర్మకు స్వర్ణ కంకణధారణ చేశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అందజేసిన ప్రసాదాన్ని సీఎం స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.  

విశాఖ ప్రజల ఘనస్వాగతం..
శారదాపీఠం వార్షికోత్సవాలకోసం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఉదయం 10.55 గంటలకు విశాఖ విమాన్రాశయానికి సీఎం చేరుకోగా.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి శారదాపీఠానికి సీఎం బయల్దేరారు. ఈ క్రమంలో ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి శారదాపీఠం వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర విశాఖ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. థ్యాంక్యూ సీఎం.. థ్యాంక్యూ సీఎం.. అనే నినాదాలు చేస్తూ, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం పట్ల తమ హర్షాతిరేకాన్ని వ్యక్తీకరించారు. ఉదయం 11.25 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు శారదాపీఠంలో గడిపిన సీఎం... మధ్యాహ్నం 2.36 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి తిరుగుపయనమయ్యారు.

తెలంగాణ గవర్నర్‌ హాజరు..
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ హాజరయ్యారు. రాజశ్యామల అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శారదా పీఠానికి చేరుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయనేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా హాజరయ్యారు. 

>
మరిన్ని వార్తలు