మద్యపానాన్ని తగ్గిస్తాం

6 May, 2020 03:30 IST|Sakshi

అదే మా విధానం.. అందుకే మద్యం ధరలు 75 శాతం పెంపు

దుకాణాల సంఖ్య ఇప్పటికే 20% తగ్గింపు.. మరో 13–15% తగ్గించాలని నిర్ణయం

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

మొత్తంగా 1/3 దుకాణాలు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాం 

43 వేల బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌ల తొలగింపు 

మద్యం అమ్మకాల వేళలూ తగ్గించాం

పూర్తి మద్య నిషేధం దిశగా ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతున్నాం 

మద్యం అక్రమ రవాణా, అక్రమ తయారీని అడ్డుకోవాలి

లిక్కర్, ఇసుక మీద మరింతగా దృష్టి సారించాలి

ఈ బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే

ఈ అంశాలను నేనే స్వయంగా పర్యవేక్షిస్తా

మద్యపానాన్ని నిరుత్సాహపరచాలంటే ధరలు షాక్‌ కొట్టేలా ఉండాలి. ఇందులో భాగంగానే 75% ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలు మరింతగా తగ్గించుకుంటూ పోతాం.ఇంతకు ముందు ప్రతి షాపు వద్ద ప్రైవేట్‌ రూమ్స్‌ (పర్మిట్‌ రూమ్స్‌) ఉండేవి. మనం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేశాం. దీంతో పాటు ఏకంగా 43 వేల బెల్టుషాపులను కూడా రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా ఉండకూడదనేది.. లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందువల్లే దుకాణాలు ప్రైవేట్‌ వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం విక్రయించే సమయాన్ని కూడా తగ్గించాం.

అక్రమ మద్యం రవాణా, తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా చెబుతున్నా. ఇసుక మాఫియా అనేది ఎక్కడా ఉండకూడదు. మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వొద్దు. ఈ అంశాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తాను.  
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే తమ ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా మద్యం రవాణా, తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వీటిని ఉపేక్షించడానికి వీల్లేదన్నారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగు నీరు, నాడు–నేడు కింద కార్యక్రమాలు, గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు, ఉపాధి హామీ కార్యక్రమాలతో పాటు మద్యం ధరల పెంపు, అక్రమ మద్యం అరికట్టడం తదితర అంశాలపై మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్య నియంత్రణపై కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

అందుకే మరింతగా పెంచాం 
► లిక్కర్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతోందనే విషయాన్ని టీవీ చానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. తొలి నుంచీ మద్యపానాన్ని నిరుత్సాహ పరచాలన్నదే మా విధానం. ఇందులో భాగంగానే మద్యం ధరలు 75 శాతం పెంచాం.  
► మనం 25 శాతం ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే మనం ఏకంగా 75 శాతం పెంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాల సంఖ్య కూడా ఇప్పటికే 20 శాతం తగ్గించాం. ఇప్పుడు మరో 13 నుంచి 15 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది అమలయ్యే నాటికి మనం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో మూడింట ఒక వంతు.. అంటే 33 శాతానికిపైగా మద్యం దుకాణాలను తగ్గించినట్లవుతుంది.  దశల వారీగా, ప్రణాళికా బద్ధంగా పూర్తి మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం.
► గత ప్రభుత్వంలో మద్యాన్ని ఎప్పుడుపడితే అప్పుడే విక్రయించే వారు. ఇప్పుడు మద్యం విక్రయించే వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే (లాక్‌డౌన్‌లో రాత్రి 7 వరకే) పరిమితం చేశాం.   

కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యత
► రాష్ట్రంలో మద్యం నియంత్రించడంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగకుండా, రాష్ట్రంలో అక్రమ మద్యం తయారు కాకుండా చూడటం చాలా ముఖ్యం. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. 
► కలెక్టర్లు, ఎస్పీలు లిక్కర్, ఇసుక మీద గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్‌ స్టాఫ్‌ మాత్రమే ఏమీ చేయలేరు. వారి సంఖ్య చాలా తక్కువ. దీంట్లో పోలీసుల భాగస్వామ్యం కావాలి. 
► వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు వీపీఆర్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు