విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?

22 Oct, 2014 21:14 IST|Sakshi
విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని హుదూద్ తుఫాను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కుప్పకూలాయో లెక్కలేదు. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తుఫాను బాధితులను ఆదుకోడానికి పెద్ద హృదయంతో చాలామంది ముందుకు వచ్చారు. భారీ విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో ఇస్తామంటూ గట్టిగానే చెప్పారు. అయితే.. వీటిలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి వచ్చినవి మాత్రం ఒకటి.. అర మాత్రమేనట.

అవును.. విరాళాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నవాళ్లలో ఎంతమంది నిజంగా ఇస్తున్నారు, ఎంతమంది కేవలం పేరుకు మాత్రమే చదివిస్తున్నారన్న విషయం తెలియడంలేదు. విశాఖలో సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి డబ్బుకోసం చూసుకుంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాళీగా కనిపిస్తోంది. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా చాలామంది పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించినా, వాటిలో చేతికి అందినవి కొన్నిమాత్రమే. కొంతమంది నేరుగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కులు పంపారు. హీరో కృష్ణ, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటివాళ్లు నేరుగా చంద్రబాబును కలిసి ఆయనకే చెక్కులు అందించారు.

మిగిలినవాళ్లు మాత్రం ఇంకా చెక్కులుగానీ, డీడీలు గానీ ఏ రూపంలోనూ విరాళాలు అందించలేదు. ఆ విషయం చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ కార్యాలయ అధికారులు మొహమాటపడుతున్నారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనకు చెక్కులు అందిస్తూ ఫొటోలు తీయించుకోడానికి ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు ఘనంగా విరాళాలు ప్రకటించి, తర్వాత ఊరుకున్నారేమోనని కూడా అంటున్నారు.

మరిన్ని వార్తలు