సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

14 Jul, 2014 02:43 IST|Sakshi
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

 ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైందని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ఆయన ఆదివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. షెడ్యూల్ ఇది.. ఈ నెల 16 బుధవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి ద్వారకాతిరుమల చేరుకుంటారు. అనంతరం తాడిచర్ల గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తరువాత కామవరపుకోటలో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొంటా రు. ఉప్పలపాడు, దేవులపల్లి మీదుగా గురవాయగూడెం చేరుకుని మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని సాయంత్రం 6 గంటలకు జంగారెడ్డిగూడెం చేరుకుంటారు.
 
 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ జంగారెడ్డిగూడెంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావే శంలో పాల్గొని కొయ్యలగూడెం చేరుకుని రాత్రి బస చేస్తారు. 17 గురువారం ఉదయం కొ య్యలగూడెంలోని పొగాకు వేలం కేం ద్రాన్ని సందర్శించి గంగవరం, పొంగుటూరు, పోతవరం, కవులూరు, చీపురుగూడెం మీదుగా నల్లజర్ల చేరుకుంటారు. అనంతపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించే స్వయం సహాయక సంఘాల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నల్లజర్ల నుంచి బయల్దేరి హైదరాబాద్ వెళతారు.
 
 లోటుపాట్లకు తావివ్వొద్దు
 ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా లోటు పాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో ఎటువంటి  పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు.  ఆయా అధికారులకు నిర్దేశించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలన్నా రు. హెలిప్యాడ్ నిర్మాణం, బారికేడ్ల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీమన్నారాయణను ఆదేశించారు. కామవరపుకోటలో నిర్వహించే రైతు సదస్సులో వ్యవసాయ అనుబంధ స్టాల్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఉపకరణాల పంపిణీకి జాబితాను ముందుగానే సమర్పించాలన్నారు.
 
 జిల్లా అభివృద్ధికి కృషి చేయండి
 వివిధ శాఖల అధికారులు పరస్పర సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్ద,చిన్న అనే తారతమ్యం లేకుండా అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించి ప్రజలకు సుపారిపాలన అందించాలన్నారు. పలు శాఖల పని తీరును కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. జేసీ బాబూరావునాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ పి.రవిసుభాష్,  ఏజేసీ సీహెచ్ నరసింగరావు పాల్గొన్నారు.
 
 ఎందుకీ పర్యటన !
 ఏలూరు : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేవు. ఎన్నికల హామీలైన డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీలపై ఇప్పటి వరకు కచ్చితమైన ప్రకటన చేయకపోవటంతో వారిని శాంతపర్చేందుకే ఈ పర్యటన అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటనలో మీ కోసం యాత్రలా బస్సులో రోడ్‌షో నిర్వహించటం, 16న రైతులతో కామవరపుకోటలోను, 17న డ్వాక్రా మహిళలతో నల్లజర్లలోను సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు