విశాఖ దుర్ఘటన; దర్యాప్తునకు సహకరిస్తాం

8 May, 2020 09:27 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ఘటనపై ఆ సంస్థ జనరల్‌ మేనేజర్ శ్రీనివాస్‌ రామ్‌ తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందజేసేందుకు కృషి చేస్తామని హామీయిచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తునకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సాంకేతిక బృందాల్ని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు)

బాధితులు త్వరగా కోలువాలని ప్రార్థిస్తున్నాం
న్యూఢిల్లీ: ఎల్‌జీ పాలిమర్స్‌  పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్‌ దౌత్యవేత్త షిన్‌బాంగ్‌ కిల్‌ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్‌ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (విశాఖ దుర్ఘటన: ఒక్క ఫోన్‌ కాల్‌ కాపాడింది)

మరిన్ని వార్తలు