నీరుగారుతున్న వయోజన విద్య

4 May, 2018 07:04 IST|Sakshi
వయోజన విద్యాకేంద్రంలో పరీక్షలు రాస్తున్న వయోజనులు(ఫైల్‌)

 ఐదు నెలలుగా అందని వేతనాలు

ఉద్యోగ భద్రతపై స్పష్టత కరువు

ఆందోళనలో సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు

ముప్పాళ్ల:  వయోజనులకు విద్య అందించాలనే లక్ష్యంతో సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వయోజనులకు, చదువు రాని వారికి ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువు చెప్పే దిశగా 2010లో సాక్షరభారత్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలోచనైతే బాగానే ఉంది కానీ ఆచరణలో మాత్రం అది అమలు కావటం లేదు. ఎప్పుడు కార్యక్రమం ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో కోఆర్డినేటర్లకే అర్థం కాకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో పనిచేసే మండల, గ్రామస్థాయి కో ఆర్డినేటర్లకు జీతాలు అందకపోవడంతో కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. జీతం లేని కొలువు ఎన్నాళ్లు చేస్తామని పలువురు  కోఆర్డినేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి విధులతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లోనూ అదనపు విధులు నిర్వహిస్తుండటంతో మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కార్యక్రమాన్ని కూడా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉండటం వయోజన విద్య మిథ్యగా మారిపోయింది.

ఐదు నెలలుగా జీతాల కరువు..
జిల్లాలో మొత్తం 57 మండలాలకు గాను, 57 మంది మండల కోర్డినేటర్‌ లు, 1022 పంచాయతీలకు గాను ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున సాక్షరభారత్‌ కోఆర్డినేటర్‌లను నియమించారు. వీరిలో రాజకీయ కోణంలో కొన్ని చోట్ల ఖాళీలు అయినప్పటికీ వాటిని భర్తీ చేసిన దాఖలాలు లేవు. గ్రామ కోఆర్డినేటర్లు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యాభోదన చేస్తారు. ఒక్కోసారి ప్రత్యేకంగా రెండు గంటల సమయం అదనంగా బోధనకు వెచ్చిస్తారు. మండల కోఆర్డినేటర్‌ జీతం నెలకు రూ.6 వేలు ఉండగా, గ్రామ కోఆర్డినేటరుకు రూ. 2 వేలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి గత ఏడాది డిసెంబర్‌  నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందడం లేదు. కొంతమంది కేవలం దీనిని నమ్ముకొనే ఉండటం వలన వారి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. మరికొందరు చేసేదేమీ లేక అప్పులు తెచ్చుకొని ఇల్లు గడుపుకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారే ఇలాంటి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయక పోవటం, జీతాలు సక్రమంగా చెల్లించక పోవటంతో కార్యక్రమంతో పాటు కోఆర్డినేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది.

ఉద్యోగ భద్రత కరువు
ఐదు నెలలుగా వేతనాలు అందాల్సి ఉంది.అక్షరాస్యతతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల నిర్వహణలో భాగంగా నిలుస్తున్నాం. అయినా మాకు ఉద్యోగ భద్రత లేదు. జీతాలు సకాలంలో రావడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి జీతాలు విడుదల చేయాలి.–ఎం.బ్రహ్మానందం,సాక్షర్‌భారత్‌ మండల కో ఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు